ArticlesNews

నీటి కరవుకు ‘చెక్‌’ పెట్టాడు

160views

నెర్రెలు బారిన నేలలు, తడారిన బావులు, ఎండిపోయిన పంటలు… ఒకప్పుడు ఆ కరవు నేలల్లో కనిపించిన దృశ్యాలివి. అయితే ఒక వ్యక్తి తనదైన జల వ్యూహంతో ఆ బీడు భూములకూ నీళ్లు అందించాడు. చెక్‌డ్యాములు, సేద్యపు కుంటలు, కాలువగట్ల నిర్మాణంతో… లక్షలాది రైతుల కష్టాలు తీర్చాడు. వాటర్‌షెడ్‌ కమిటీలతో సంపదలు పెంచి దక్షిణాది జలయోధుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఇటీవల ప్రతిష్ఠాత్మకమైన జలశక్తి అవార్డును అందుకున్న పొదిలి రాజశేఖరరాజు ప్రయాణం ఇది…

ఆ ఊరి పేరు కొక్కెర కొండాయిపాలెం. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో ఉంది. ఒకప్పుడు తీవ్ర కరవు గ్రామం. పొదిలి రాజశేఖరరాజుదీ ఆ పల్లెటూరే. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చేతిపంపు నుంచి బిందెల కొద్దీ నీళ్లు మోసుకురావడమే… తన బాల్యానికి సంబంధించిన తొలి జ్ఞాపకమని చెబుతాడు రాజశేఖర్‌. ఆ కొద్దిపాటి నీళ్లతోనే ఇంటి అవసరాలు తీరాలి, పశువుల గొంతులు తడవాలి. రాజశేఖర్‌ తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలే. ఆ కుటుంబానికి ఎకరం పైచిలుకు మెట్ట పొలం ఉండేది. వర్షాభావ పంటలైన మినుములు, నువ్వులు వేసేవారు. ఒకసారి కృష్ణా కాలువ నుంచి ఆరుతడి నీళ్లిస్తారని ప్రచారం జరగడంతో, ఆశగా వరిపంట వేశారు. చివరికి నీళ్లు రాలేదు. ఎప్పట్లాగే వర్షం కూడా ముఖం చాటేసింది. దీంతో కళ్లముందే పంట ఎండిపోయింది. ‘ఆ ఎండిన పంటని చూసి మా నాన్న కన్నీరుపెట్టుకోవడం నన్ను కదిలించింది. ఎలాగైనా, నాన్నలాంటి బక్క రైతుల నీటి కష్టాలు తీర్చాలని బలంగా నిర్ణయించుకున్నాను’ అంటాడు రాజశేఖర్‌. అప్పటికి తను ఇంటర్‌ చదువుతున్నాడు. ఆ తర్వాత తెనాలిలో బీఎస్సీ చేశాడు. నీటి నిర్వహణపైన పట్టు సాధించాలనే సంకల్పంతో అహ్మదాబాద్‌లోని ‘ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’లో పీజీ డిప్లొమా కోసం దరఖాస్తు చేశాడు. కానీ, అక్కడ ఫీజులు చాలా ఎక్కువ. రెండేళ్ల కోర్సుకు రూ.1.20 లక్షలు! స్నేహితులు, ఆత్మీయులు చందాలు వసూలు చేసి మరీ అహ్మదాబాద్‌ పంపారు. వాళ్లంతా తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు రాజశేఖర్‌. నీటి అభివృద్ధి పథకాల అమలులో పట్టు సాధించి, జల నిపుణుడిగా క్యాంపస్‌ నుంచి బయటికొచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూళ్లలో పనిచేయాలన్న లక్ష్యంతో తెనాలికి చెందిన ‘ఎఫర్ట్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థలో చేరాడు.

వాటర్‌షెడ్‌ పథకం
అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, జాతీయ వ్యవసాయ-గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్‌) కలిసి వాటర్‌షెడ్‌ డెవలప్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చాయి. దాదాపు వందకోట్ల ప్రాజెక్టు అది. నిధులైతే ఉన్నాయి కానీ గ్రామీణస్థాయిలో వాటిని చిత్తశుద్ధితో అమలు చేసేవారే లేకుండా పోయారు. రాజశేఖర్‌ తమ ఎన్జీఓ ద్వారా ఆ బాధ్యతని తీసుకున్నాడు. నాటి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకి ప్రాజెక్టు ఇన్‌ఛార్జిగా రంగంలోకి దిగాడు. ఎంత కరవునేల అయినా ఏదో ఒకరోజు వర్షమంటూ పడకమానదు. పిల్లకాలువలు పొంగిపొర్లకా మానవు. మరే జలవనరూ లేని కరవు ప్రాంతాల్లో… ఆ చిన్న కాలువలకి అడ్డుకట్ట (చెక్‌ డ్యాముల ద్వారా) వేసి, ప్రవాహాన్ని మళ్లించే కరకట్టలు కందకాలు తవ్వి, ఆ నీటిని నిల్వచేయడానికి సేద్యపు కుంటలు ఏర్పాటు చేయడమే వాటర్‌షెడ్‌ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దాన్నే తొలిసారిగా నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని నందిపాడులో అమలు చేశాడు రాజశేఖర్‌.

మారిన ముఖచిత్రాలు…
వాటర్‌షెడ్‌ పథకం కింద ప్రతి గ్రామానికీ కోటి రూపాయలొస్తాయి. గ్రామస్థులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి… ఆ నిధులు అప్పగిస్తారు. మొదట్లో, ఆ విషయం అర్థంకాక ‘మా పేరు చెప్పుకుని సర్కారు డబ్బులు తినడానికొచ్చారా?’ అంటూ రాజశేఖర్‌ బృందంతో గొడవకు దిగేవారు అమాయక పల్లెవాసులు. చాలాచోట్ల గ్రామ కమిటీలో ఎవరెవరు ఉండాలన్న విషయంలో పట్టింపులకి వెళ్లి… ఆ కోపతాపాలు వీళ్లపైన చూపేవారు. రాత్రంతా గదిలో బంధించిన సందర్భాలూ ఉన్నాయి. ‘ఆ ప్రజలే వాళ్ల ఊరికి జలకళ వచ్చాక… పల్లకీలో ఊరేగించారు’ అని నవ్వుతూ చెబుతాడు రాజశేఖర్‌. అలా తన 20 ఏళ్ల కెరీర్‌లో 250 గ్రామాల ముఖచిత్రాలు మార్చేశాడు తను. సుమారు రెండు లక్షల రైతు కుటుంబాల సంపదని పెంచాడు. సుమారు 50 లక్షల ఘనపు మీటర్ల జల వనరుల్ని సృష్టించగలిగాడు. మొదట నాబార్డ్‌ తరపున ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తా జిల్లాలకే పరిమితమైనా, తర్వాత వివిధ కంపెనీల కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎర్‌ఆర్‌) విభాగాలతో సమన్వయం చేసుకుని… ఏపీలోని వైఎస్సార్‌ కడప జిల్లా మైలవరం, తెలంగాణలోని సూర్యాపేట ప్రాంతాల్లోనూ సేవలందించాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ -కర్ణాటక సరిహద్దు గ్రామాలకి జలకళ తెప్పిస్తున్నాడు! రాజశేఖర్‌ అంతర్జాతీయ గ్రీన్‌టెక్‌ అవార్డునీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ‘వాటర్‌ హీరో’ పురస్కారాన్నీ అందుకున్నాడు. తాజాగా జలశక్తి వ్యక్తిగత అవార్డూ వరించింది. ఈ ఏడాది దక్షిణాది నుంచి ఆ గౌరవాన్ని అందుకున్న ఏకైక వ్యక్తి… రాజశేఖరే కావడం మరో విశేషం!