NewsProgramms

ధర్మ రక్షా నిధికై ధర్మాచార్యుల పిలుపు

1.6kviews

గుంటూరులో 22/1/ 2020 బుధవారం సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పూజ్య ధర్మాచార్యుల సదస్సులో రాష్ట్రంలోని వివిధ మఠాలు, పీఠాలకు చెందిన పూజ్య ధర్మాచార్యులు పాల్గొని రాష్ట్రంలోని హిందూ ధర్మ రక్షణకై ప్రతి హిందువూ తనవంతుగా ధర్మ రక్షా నిధిని సమర్పించవలసిందిగా ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పూజ్య ధర్మాచార్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో కనీసం లక్ష మంది హిందువులు ఈ ధర్మ రక్షా యజ్ఞంలో పాలు పంచుకోవాలని ఆకాంక్షించారు. భీష్మ ఏకాదశి (5 – 2 – 2020) మరియు మహాశివరాత్రి (21 – 2 – 2020) పర్వదినాల పవిత్ర మాసంలో ప్రతి హిందువూ తన ఆదాయం నుంచి కొంత విరాళాన్ని ధర్మ రక్షా నిధిగా సమర్పించి ధర్మ రక్షా యజ్ఞంలో భాగస్వామ్యం వహించవలసినదిగా కోరారు.

ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ దాసరి శ్రీనివాసులు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ చిన జీయర్ స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ (వ్యాసాశ్రమం), శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ వాసుదేవానంద గిరి స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ ప్రణవానంద స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ శివ స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ విరజానంద స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ మాతా శీలానందజీ, శ్రీ శ్రీ శ్రీ అహోబిల జీయర్ స్వామిజీ, శ్రీ శ్రీ శ్రీ కపిలేశ్వరానంద స్వామీజీ తదితర పూజ్య స్వామీజీలు పాల్గొన్నారు.

అలాగే రిటైర్డ్ డి జి పి డాక్టర్ కే అరవిందరావు, ప్రముఖ పాత్రికేయులు శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు డాక్టర్ కే ఉమామహేశ్వరరావు, డాక్టర్ పరశురాం,  శ్రీ గోపాలకృష్ణ, డాక్టర్ ముక్తేశ్వరరావు తదితర పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు.

ధర్మ రక్షా నిధి ఉద్దేశ్యం

స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన ప్రభుత్వాలలో జాతీయవాద దృక్పథం కొరవడిన కారణంగా కొందరు హిందువులలో ధార్మిక నిష్ఠ తగ్గి, ప్రలోభాలకు, భయాలకు లొంగి పర మతాల మాయలో పడి తమ మాతృ ధర్మాన్ని విడనాడి పర ధర్మాన్ని స్వీకరించారు.

స్వామి వివేకానందుడు చెప్పినట్టుగా “ఒక హిందువు స్వధర్మాన్ని వీడి పర ధర్మాన్ని స్వీకరిస్తే మనలోని ఒకడు తగ్గడమే కాదు, మన శత్రువు ఒకడు పెరిగాడు అని అర్థం”.

ఒక వ్యక్తి మన ధర్మాన్ని వీడి పర ధర్మాన్ని స్వీకరించిన మరుక్షణం అతను ఈ భూమితో అప్పటివరకు తనకు గల మాతా పుత్ర సంబంధాన్ని కోల్పోతున్నాడు. ఈ జాతి చరిత్ర పట్ల, పరంపర పట్ల విశ్వాసాన్నీ, భక్తినీ, గౌరవాన్నీ కోల్పోతున్నాడు. తరతరాలుగా తమ పూర్వీకులు ఆరాధిస్తూ వచ్చిన దేవీ దేవతల పట్ల విముఖత పెంచుకుంటున్నాడు. ఆ దేవీ దేవతల పట్ల, ఈ దేశానికి చెందిన చారిత్రిక పురుషుల పట్ల ద్వేష భావాన్ని పెంచుకుంటున్నాడు. అంటే పరమత బోధనలను ఆలకించడం మొదలవడంతోనే అతను ఈ జాతి వ్యతిరేకిగా మారడం మొదలవుతోందన్నమాట. అంతేకాదు అతను మారిన తర్వాత తన చుట్టూ ఉన్న వారిని కూడా తన లాగే మార్చకపోతే తాను నమ్ముకున్న కొత్త దేవుడికి ప్రీతి పాత్రుడను కాలేనని, ఆయన ఆగ్రహానికి గురి కావలసి వస్తుందన్ననమ్మకం అతనిపై రుద్దబడుతోంది. దాంతో అతను మిగిలిన జీవితమంతా మతమార్పిడికి కృషి చేయడం జరుగుతోంది.

దీని కారణంగానే నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాలలో హిందువుల సంఖ్య ఒకటి రెండు శాతానికి పడిపోయింది. కేరళ, బెంగాల్ వంటి రాష్ట్రాలలో 40 శాతానికి పడిపోయింది. ఆ మిగిలిపోయిన కొద్దిమంది హిందువులు ఆయా ప్రాంతాలలో అనుభవించే బాధలు, అణచివేత, వేధింపులు వర్ణనాతీతం.

మన రాష్ట్రంలో సైతం 18 శాతం మంది  ఇప్పటికే మతం మార్చబడినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక అనధికారికంగా కూడా అధిక సంఖ్యలోనే ఈ మతాల భారిన పడ్డవారు ఉన్నారు.

జరుగుతున్న పరిణామాల దృష్ట్యా హిందూ ధర్మ రక్షణకు నడుం బిగించిన పూజ్య ధర్మాచార్యులు, పెద్దలు 2015లో సమరసతా సేవా ఫౌండేషన్ అనే సంస్థకు బీజం వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంయుక్త సహకారంతో ఎస్ ఎస్ ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా హరిజన, గిరిజన, మత్స్యకార పల్లెలలో 500 దేవాలయాలను నిర్మించింది. ఈ దేవాలయాల కేంద్రంగా ఈ సంస్థ రాష్ట్రంలోని 370 మండలాలలో సుమారు 400 మంది  ధర్మ ప్రచారకులను నియమించి అన్ని వర్గాలలో ఇంటింటికి ధర్మ ప్రచారం, భజన మండళ్లు, సామూహిక హారతి, బాల వికాస కేంద్రాలు, భగవద్గీత ప్రచార కార్యక్రమాలు మొదలగు కార్యక్రమాల ద్వారా ఆయా ప్రాంతాలలో ధార్మిక చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నది. సుమారు రెండు వందల కేంద్రాలలో నూతనంగా ప్రారంభించిన బాలవికాస కేంద్రాల ద్వారా బాల బాలికలలో, వారిద్వారా కుటుంబాలలో, కుటుంబాల ద్వారా గ్రామాలలో విశేషమైన పరివర్తన కనిపిస్తున్నది.

అలాగే 30 డివిజన్లలో 2500 గ్రామ పంచాయతీలలో మహిళా విభాగం యొక్క పని చురుగ్గా సాగుతోంది. గ్రామీణ మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం వివిధ అంశాలలో మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. మహిళా కన్వీనర్లు తమ ఇంటి బాధ్యతలు నిర్వర్తించుకుంటూనే ఇంటింటికీ ధర్మ ప్రచారం, నగర సంకీర్తన, ఆసుపత్రిలోని రోగులను పరామర్శించడం, సంక్షేమ హాస్టళ్లను సందర్శించడం వంటివి చేస్తున్నారు.

ఇంకా ఈ కార్యం రాష్ట్రంలోని అనేక గ్రామాలకు విస్తరించవలసి ఉంది. అనేకమంది పూజ్య ధర్మాచార్యులు, పెద్దల ఆశీస్సులతో, ఎందరో వదాన్యుల ఆదరణతో ఎన్నో బాలారిష్టాలను అధిగమించి ఎస్ ఎస్ ఎఫ్ గత నాలుగేళ్లుగా తన ప్రస్థానాన్ని కొనసాగించింది.

“ ధనమూలమిదం జగత్” అన్న పెద్దల వాక్కు మనకు తెలియనిది కాదు. వందల కేంద్రాలలో వందలాది మంది వ్యక్తుల నిరంతర భాగస్వామ్యము, కృషి అవసరమైన ఈ కార్యానికి ఆర్థిక వనరుల అవసరం కూడా అదే స్థాయిలో ఉంది. అంతేకాకుండా ఈ ధర్మ రక్షా కార్యంలో యావత్ హిందూ సమాజాన్నీ భాగస్వామిగా చేయవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే పూజ్య ధర్మాచార్యులు, పెద్దలు హిందూ సమాజంలోని వదాన్యుల నుంచి, హిందూ ధర్మ రక్షా దీక్ష వహించిన వివిధ హిందూ సంఘాల కార్యకర్తల నుంచి ధర్మ రక్షా నిధిని సేకరించాలని సంకల్పించారు. త్వరలో మన దగ్గరకు కూడా మన సమీపంలోని ధర్మ ప్రచారకులు ధర్మ రక్షా నిధి సేకరణకు వస్తారు. ఈ పవిత్ర యజ్ఞంలో, అంతే పవిత్ర హృదయంతో మనమూ ఓ సమిధను భక్తిగా సమర్పించడానికి సిద్ధమవుదాం. ఈ ధర్మ గంగా ప్రవాహం నిరంతరాయంగా కొనసాగి ఆంధ్ర రాష్ట్రంలోని పల్లె పల్లెనూ సస్యశ్యామలం చేసి, గడప గడపలో పసుపు కుంకుమలు పూసి, గుండె గుండెలో ధర్మ జ్యోతిని వెలిగించి పవిత్ర సనాతన హైందవ సంస్కృతిని పునరుజ్జీవింపచేయడం కోసం మన వంతుగా యధాశక్తి ధనమును అర్పిద్దాం. ఏదో తృణమో పణమో అన్నట్టుగా కాకుండా శక్తివంచన లేకుండా ఈ పవిత్ర కార్యానికి మన వంతు సహాయ సహకారాలను అందించడానికి మనమందరం ముందుండాలి.

భారత్ మాతాకీ జయ్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.