
ప్రఖ్యాత ఉడిపి పెజావర్ మఠాధిపతి పూజ్య విశ్వేశతీర్థ భగవదైక్యం చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మణిపాల్ కస్తూర్బా వైద్యశాలలో చికిత్స పొందిన ఆయన అపస్మారక స్థితికి చేరడంతో ఆదివారం తెల్లవారుఝామున మఠానికి తరలించారు. అక్కడే చివరి వరకు చికిత్సను అందజేశారు. అప్పటికే మెదడు నిష్క్రియగా మారడంతో స్వామీజీ భగవదైక్యం చెందారు.
శ్రీ విశ్వేశతీర్థ ఆజన్మాంతం భగవంతుని సేవలో తరించారు. అయోధ్య రామజన్మ భూమి ఉద్యమ మార్గదర్శకులలో స్వామీజీ ఒకరు. “దీనజనుల సేవయే భగవంతుని సేవ” అని బోధించిన శ్రీ విశ్వేశతీర్థ అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేశారు.
స్వామీజీ నిర్యాణం హిందూ సమాజానికి తీరని లోటు : ఆర్. ఎస్. ఎస్

పూజ్య విశ్వేశతీర్థ నిర్యాణం పై ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పూజ్య స్వామీజీ హిందూ సమాజంలోని అంతరాలను తొలగించి సమరసతను సాకారం చెయ్యడానికి విశేష కృషి సలిపారని శ్రీ భాగయ్య పేర్కొన్నారు. హిందువులలో పతితులెవ్వరూ లేరని (“న హిందుర్ పతితో భవేత్”), అందరూ పవిత్రులేనని, అంటరానితనం హైందవ సమాజానికి శాపమని పూజ్య స్వామీజీ ప్రబోధించారని శ్రీ భాగయ్య పేర్కొన్నారు. భక్తులు అపర శ్రీ కృష్ణావతారంగా భావించే పూజ్య స్వామీజీ నిర్యాణం హిందూ సమాజానికి తీరని లోటని శ్రీ భాగయ్య పేర్కొన్నారు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి : ప్రధాని

పూజ్య పెజావర్ స్వామీజీ నిర్యాణం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. గతంలో శ్రీ విశ్వేశతీర్థను కలిసినప్పటి ఓ చిత్రాన్ని ట్విటర్‌లో ఉంచి అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. భక్తుల సందర్శనార్థం మహాత్మా గాంధీ మైదానంలో స్వామీజీ పార్ధివ దేహాన్ని మూడు గంటలపాటు ఉంచనున్నారు. అక్కడే పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించనున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





