NewsProgramms

గుంటూరులో కౌశలంను ప్రారంభించిన మాజీ కేంద్ర మంత్రి శ్రీ సురేష్ ప్రభు

535views

గుంటూరు,సంపత్ నగర్ లోని సేవాభారతి ప్రాంగణంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం ‘కౌశలం’ భవనాన్ని  మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి వర్యులు శ్రీ సురేష్ ప్రభు శిలాన్యాసంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమం పురప్రజలు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో సేవాభారతి అధ్యక్షులు డాక్టర్ కె ఎస్ ఎన్ చారి సేవాభారతి ద్వారా జరుగుతున్న పలు సేవా కార్యక్రమాలను తెలియచేస్తూ  ప్రభుత్వాసుపత్రిలో ప్రతిరోజూ 500 మందికి పేషెంట్ అటెండెన్స్ కి మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. 2 ట్యాంకర్ల ద్వారా 24 సేవా బస్తీలలో ప్రతిరోజు త్రాగునీటి సరఫరా చేస్తున్నట్లు తెలియజేశారు .గుంటూరులో 2 మొబైల్ మెడికల్ వ్యానులు పనిచేస్తున్నాయని ,48 ట్యూషన్ సెంటర్లు నడుస్తున్నాయని , ఇక్కడ ప్రారంభిస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా అనేక మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడేలా , ప్రతి సంవత్సరం ఒక వెయ్యి మందికి ఉపాధి కలిగించే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు.

తరువాత ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు శ్రీ సురేష్ ప్రభు గారు మాట్లాడుతూ సమాజంలో ప్రతి పనికి ప్రభుత్వం మీద ఆధారపడకూడదు ,సమాజం    స్వావలంబన  సాధించాలని, సమాజంలో అందరూ ఒకే రకమైన సమర్ధత కలిగి ఉండాలని ,సమర్ధతతో జన్మించిన మనం సమాజానికి ఆధారంగా ఉండి సమాజం ఉన్నత స్థితికి చేరే ప్రయత్నం చేయాలని కోరారు. అందుకొరకే ఇలాంటి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ప్రారంభించి తద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలను కల్పించాలని తెలియజేశారు. డిగ్రీలు అనేవి అన్నింటినీ  సమకూర్చలేవని, వృత్తి నైపుణ్య విద్య ద్వారా వాటిని మెరుగుపరచుకోవాలని, అలానే అదనపు అర్హతలు కూడా సంపాదించుకోవాలని ఆయన యువతకు సందేశం ఇచ్చారు. సమాజానికి ఏమి అవసరమో వాటిని మనము సమకూర్చుకోవాలి అని చెప్తూ రత్నగిరి జిల్లాలో ఒక లక్ష మంది లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ ద్వారా నర్సింగ్ కోర్సు , స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొదలైనవి ఏర్పరచడం  ద్వారా దానిని సాధించడం జరిగిందని తెలియజేశారు. మన రాష్ట్రంలో 13 జిల్లాలకు లైఫ్ సేవింగ్ అంబులెన్స్ లను  కేంద్ర ప్రభుత్వం  ద్వారా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు కాదు మానవుల అభివృద్ధి కూడా అని తెలియజేశారు. అభివృద్ధిలో భాగంగా ప్రతి జిల్లాలో రెండు నుండి మూడు శాతం అభివృద్ధి సాధిస్తే GDP పెరుగుతుంది అన్నారు. యూనిఫామ్ ధరించిన ప్రతి సైనికుడు తన దేశాన్ని ఎలా కాపాడుకుంటాడో సమాజంలోని ప్రతి వ్యక్తి ఇది నా సమాజం నా దేశం అనుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ ప్రయత్నంలో సేవాభారతి కార్యక్రమాలు అభినందనీయం అని తెలియజేశారు.

అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మికత యొక్క రూపాంతరము సేవ అని తెలియజేశారు.  సేవ చేయడమేకాదు ఫలితాన్ని అనుభూతి చెందటం కార్యకర్తలు అలవరచుకోవాలి అన్నారు. సేవ చేస్తూ చేస్తూ ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తూ వ్యక్తి తనలో మార్పును తెచ్చుకోగలగాలి, అలానే సమాజంలో కూడా మార్పును తెచ్చేందుకు ప్రయత్నం చేయాలి అన్నారు.  సేవా భారతి ద్వారా  ఇన్ఫర్మేషన్, ఇన్ స్పిరేషన్, శిక్షణ కలిగించటం ద్వారా సమాజంలో యువతని ముందుకు నడిపించి వారిని స్వావలంబన దిశగా ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలి అని సూచించారు. “మన ఆంధ్ర ప్రదేశ్ లో 13 జిల్లాలలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను  సేవా భారతి ప్రారంభించాలని ఆశిస్తున్నాను”. అని తెలియజేశారు.

డాక్టర్ డి వి హరి ప్రసాద్, శ్రీ యనమల పిచ్చి రెడ్డి, శ్రీ కాకాని పృథ్వీరాజులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ రావెల కిషోర్ బాబు, టొబాకో బోర్డు చైర్మన్ శ్రీ ఎడ్లపాటి రఘునాథబాబు, శ్రీ లక్ష్మీపతి పాల్గొన్నారు. 90 సంవత్సరాల సీనియర్ శ్రీ కోట సూర్యనారాయణకు శ్రీ సురేష్ బాబు సత్కారం చేశారు. అనంతరం శ్రీ సురేష్ బాబును డాక్టర్ చారి శాలువతో సన్మానించారు. వందేమాతరం పూర్తి గీతంతో ప్రారంభమైన కార్యక్రమం జన గణ మన తో ముగిసింది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.