ArticlesNews

పాక్ లోని హిందువులకు ‘‘ఈ యేడాది గడ్డు కాలమే’’… రిపోర్టు తయారు చేసిన మానవ హక్కుల కమిషన్

216views

పాకిస్తాన్ లో మైనారిటీలపై హింస ఆగడం లేదు. ముఖ్యంగా హిందువులను అక్కడి ముస్లిం ఛాందసులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ విషయాలు పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ నివేదికలో వెల్లడైంది. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (HRCP) ఈ నెల 19 న ‘స్ట్రీట్స్ ఆఫ్ ఫియర్: ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ ఆర్ బిలీఫ్ ఇన్ 2024/25’అనే పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. హిందువులు, క్రైస్తవ, అహ్మదీయ సమాజాన్ని ప్రస్తావిస్తూ.. స్వేచ్ఛ, హక్కుల విషయంలో ‘‘ఈ సంవత్సరం వారికి చాలా గడ్డుకాలమే’’ అని అందులో పేర్కొంది.

ఈ కమిషన్ నివేదికల ప్రకారం పాక్ లో మతపరంగా మైనారిటీలపై హింస పెరిగిందని ఆందోళన వ్యక్తమైంది. గత సంవత్సరంలో హిందూ బాలికలను బలవంతంగా మత మార్పిడి చేశారని, మైనర్ వివాహాల కేసులు కూడా పెరిగినట్లు నివేదిక పేర్కొంది.

మైనారిటీల ప్రార్థనా స్థలాలే టార్గెట్ :
మైనారిటీపై హింస మాత్రమే కాకుండా.. ఛాందసులు మైనారిటీల ప్రార్థనా స్థలాలను కూడా టార్గెట్ చేస్తున్నారు.హిందువులు, క్రైస్తవులు, అహ్మదీయులకు సంబంధించిన ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకొని, ముస్లిం ఛాందసులు పెట్రేగి పోయినట్లు నివేదికలో పొందుపరిచారు.

పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ప్రకారం.. పంజాబ్, సింధ్ ప్రావిన్సులలో హిందూ, క్రైస్తవ మతాలకు సంబంధించిన బాలికను బలవంతంగా ఛాందసులు మత మార్పిళ్లు చేశారని, అలాగే వారి బాల్య వివాహాలు కూడా కొనసాగుతున్నాయని పొందుపరిచారు. బాల్య వివాహాలను నిరోధించే చట్టాలను అక్కడ అమలు చేయడం లేదని కూడా పేర్కొన్నారు. దీని విషయంలో సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని మానవ హక్కుల కమిషన్ నిర్మొహమాటంగా చెప్పేసింది.

దైవదూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను, ముఖ్యంగా మైనారిటీలను మూకుమ్మడిగా కొట్టి చంపే ధోరణి కూడా పెరిగిందని కమిషన్ పేర్కొంది. చట్టాలను తక్షణమే సవరించాలని, యంత్రాంగాన్ని సంస్కరించాలని కమిషన్ సూచించింది. చట్టపరమైన ప్రక్రియ లేదా కోర్టు ద్వారా తీర్పులు లేకుండా వ్యక్తులను చంపేస్తున్నారని మండిపడింది.

ఇక ఏకంగా రాజ్యాంగబద్ధమైన వ్యక్తులను కూడా ఛాందసులు బెదిరిస్తున్నారని కమిషన్ పేర్కొంటూ.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తినే బెదిరించారని పేర్కొంది. అలాగే ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నికైన ప్రతినిధులను కూడా బెదిరించాలని, ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అలాగే దైవ దూషణ చేస్తున్నారంటూ కొందరిపై దాడులు చేస్తున్నారని, దీనిపై ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.