News

ప్రకృతి వ్యవసాయం.. ఆరోగ్య హితం

227views

ఎరువులు, పురుగు మందుల వినియోగం మోతాదుకు మించడంతో ఆహార ఉత్పత్తులు విషతుల్యం అవుతున్నాయి. పెట్టుబడులు పెరిగి సేద్యం రైతులకు లాభసాటి అవ్వట్లేదు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌ ఏర్పాటుచేసి అన్నదాతలను వెన్నుతడుతోంది. గతేడాది కంటే రెట్టింపు విస్తీర్ణంలో ఈసారి గుంటూరు జిల్లాలో ప్రకృతి సాగు చేయించేలా అధికారులు ప్రణాళిక రూపకల్పన చేశారు. ప్రతి ఊరిలోనూ రైతులను సహజ సేద్యం బాట పట్టించనున్నారు. 190 క్లస్టర్ల పరిధిలో 82 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు చేయించనున్నారు.

భూమి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతోపాటు రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మట్టిలో ఉండే సూక్ష్మజీవుల ప్రాధాన్యాన్ని తెలియజేయడం, పొలాల్లో బయోఇన్‌పుట్‌ల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా సాగు ఖర్చును తగ్గించడం సహజ సేద్యంతోనే సాధ్యమవుతుంది.

ఐదు బయోరిసోర్స్‌ సెంటర్లు.. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, కాషాయాల తయారీతో పాటు అన్ని రకాల ప్రోత్సాహాకాలు అందజేసేలా జిల్లాలో లేమల్లె(అమరావతి), ఉన్నవ(యడ్లపాడు), దొడ్లేరు(క్రోసూరు), ఓబులేసునిపల్లి(దుర్గి), నాగిరెడ్డిపాలెం(బెల్లంకొండ మండలం) గ్రామాల్లో బయో రిసోర్స్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటుకు ఎవరైనా ముందుకొస్తే ప్రోత్సహించనున్నారు. సహకార సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

కృషి సఖిలుగా డ్వాక్రా మహిళలు.. సహజ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ రైతులకు.. వ్యవసాయ శాఖకు అనుసంధానకర్తలుగా ఉండే డ్వాక్రా మహిళలను కృషి సఖిలుగా గుర్తించనున్నారు. ప్రస్తుతం క్లస్టర్‌కు ఒకరిని నియమించనున్నారు. తర్వాత మరొకరిని నియమించనున్నారు. వీరికి నెలకు రూ.5 వేలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు.

46 వేల మంది రైతులు.. గతేడాది జిల్లాలో 39 వేల మంది రైతులతో 40 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయించారు. మండలానికి రెండు, గ్రామాల్లో సాగు చేపట్టారు. ఈ సంవత్సరం 46 వేల మంది రైతులతో 82 వేల ఎకరాల్లో సాగు చేయించేలా ప్రణాళికలు రూపకల్పన చేశారు. జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి ఊరిలోనూ సహజ సేద్యం ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం.. ప్రకృతి సాగు పద్ధతుల్లో పండించిన పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌కు చర్యలు చేపడుతున్నారు. మండల, జిల్లా కేంద్రాలు, రైతుబజార్లలో స్టాళ్లు ఏర్పాటుచేసి ఉత్పత్తులు విక్రయించారు. ప్రకృతి సేద్యంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు అన్నదాతలు ముందుకు రావాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ అమలకుమారి సూచించారు.