
భూమికి 28వేల కాంతి సంవత్సరాల దూరంలోని ఒక కృష్ణబిలం నుంచి వెలువడుతున్న ఎక్స్‌రే సంకేత తీరు వెనుక గుట్టును భారత్, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు విప్పారు. మన దేశం ప్రయోగించిన ఖగోళ పరిశీలక ఉపగ్రహం.. ఆస్ట్రోశాట్ ఇందుకు సాయపడింది. ఈ కృష్ణబిలం నుంచి వెలువడే ఎక్స్‌రే వెలుగుల్లో రెండు దశలు ఉన్నాయి. ఒకటి.. ప్రకాశవంతంగా ఉండగా, రెండోది మసకమసకగా ఉంటోంది. ఒక్కో దశ కొన్ని వందల సెకన్లు సాగుతోంది. దీనిపై గువాహటి ఐఐటీ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన యు.ఆర్.రావు ఉపగ్రహ కేంద్రం, ఇజ్రాయెల్‌లోని హైఫా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కృష్ణబిలాలు పొరుగునున్న నక్షత్రాల నుంచి వాయువులను స్వాహా చేస్తుంటాయి. ఈ క్రమంలో తీవ్ర వేడి, ఎక్స్‌రేలను వెలువరిస్తుంటాయి.
తాజా కృష్ణబిలం నుంచి వస్తున్న ఎక్స్‌రేలు వేగంగా వెలుగుతూ, ఆరిపోతూ తళుకులీనడాన్ని తొలిసారిగా తాము గమనించినట్లు ఐఐటీ గువాహటి పరిశోధకుడు శాంతబ్రత దాస్ పేర్కొన్నారు. దేదీప్యమాన దశలో సెకనుకు దాదాపు 70సార్లు ఇలా జరుగుతున్నట్లు వివరించారు. ప్రకాశవంతంగా లేని దశలో ఇలాంటివి ఉండటంలేదని పేర్కొన్నారు. తళుకులు బలంగా ఉన్నప్పుడు ఈ కృష్ణబిలం చుట్టూ ఉన్న కరోనా కుంచించుకుపోతోందని, గణనీయంగా వేడెక్కుతోందన్నారు. దానికి భిన్నంగా.. మసక దశలో ఉన్నప్పుడు అది విస్తరిస్తూ, తక్కువ ఉష్ణోగ్రతలను కలిగి ఉంటోందని వివరించారు. ఫలితంగా తళుకులు ఉండటంలేదని వివరించారు. దీన్నిబట్టి ఈ కృష్ణబిల కరోనాకు స్థిర ఆకృతి లేదని, అందులోకి వాయువులు ప్రవహించే తీరును బట్టి అది మారుతోందని తేల్చారు. కృష్ణబిలాల ఎదుగుదల, వాటి నుంచి వెలువడే శక్తి, పరిసరాలపై ప్రభావం వంటి అంశాల్లో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని వివరించారు.





