News

పౌరసత్వ చట్టంపై స్టే ఇవ్వడం కుదరదు – సుప్రీం కోర్టు

461views

దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన పౌరసత్వ సవరణ చట్టం అమలును నిలిపేలా స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్లపై జనవరి రెండో వారంలోగా స్పందన ఇవ్వాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 22కు వాయిదా వేసింది.

పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, అసోం గణ పరిషత్‌, మక్కల్‌ నీది మయం(కమల్‌ హాసన్‌ పార్టీ), మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సహా పలు రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు సుప్రీంకోర్టులో దాదాపు 60 పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

మరోవైపు ఈ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో మొదలైన ఆందోళనలు ఇతర రాష్ట్రాలకు పాకాయి. దేశ రాజధాని దిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో విద్యార్థులు గత ఆదివారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. అటు సీలంపూర్‌లోనూ స్థానికులు నిరసనకు దిగి పోలీసులపైకి రాళ్లు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కాగా, ఆందోళనల నేపథ్యంలో ఈశాన్య దిల్లీలో 144 సెక్షన్‌ విధించారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.