News

సీఏఏపై పాక్‌కు భారత్‌ చురకలు

567views

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పాకిస్థాన్‌ పార్లమెంటు తీర్మానం చేయడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. పాక్‌లో మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాల నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చడానికే ఇటువంటి తీర్మానాలు చేస్తోందని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. సొంత దేశంలోని పరిస్థితులపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన ఓ దేశం ఇలాంటి తీర్మానాలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించింది. జమ్మూకశ్మీర్‌ విషయంలో పాక్‌ చేస్తున్న నిరాధార ఆరోపణల పరంపరలోనే ఈ తీర్మానం కూడా వచ్చిందని తెలిపింది. సీఏఏ అసలు లక్ష్యాల్ని పాక్‌ కావాలనే ఈ తీర్మానంతో తప్పుగా చూపెట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టింది. కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో హింసకు గురవుతున్న మైనారిటీలకు భారత్‌ పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం అసలు ఉద్దేశం అని పునరుద్ఘాటించింది. సీఏఏ వల్ల దేశంలోని ఏ ఒక్కరి పౌరసత్వమూ రద్దు కాదని తెలిపింది.

ప్రపంచంలో భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అన్న విషయం గుర్తుంచుకోవాలని పాక్‌కు భారత్‌ హితవు పలికింది. ఇక్కడ ప్రభుత్వాల్ని ప్రజలు స్వేచ్ఛగా ఎన్నుకుంటారని.. మతంతో సంబంధం లేకుండా భారతీయులందరికీ సమాన హక్కులు లభిస్తాయని గుర్తుచేసింది. సోమవారం పాక్‌ పార్లమెంటు సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. చట్టం ద్వైపాక్షిక నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.