
మహా వృక్షాల పరిరక్షణకు రాఖీ కట్టాలి.. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ పిలుపునిచ్చారు.
విశాఖలోని రైల్వే గెస్ట్‌హౌస్ దగ్గరున్న సుమారు 138 ఏళ్ల చరిత్ర కలిగిన మహా మర్రి వృక్షానికి గ్రీన్ క్లైమేట్ బృందం, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ కళాశాల, లిటిల్ ఏంజెల్స్ పాఠశాల విద్యార్థులు రాఖీ కట్టి పూజలు నిర్వహించారు.
కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ మోహనలక్ష్మి మాట్లాడుతూ సమస్త జీవరాశుల్ని కాపాడుకోవాలన్నారు. భూమి మీద ఏ ప్రాణి అంతరించినా దాని ప్రభావం మానవాళి మీద ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం అవసరమన్నారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. విశాఖ పోర్టు ఉద్యానవన అధికారిణి రాధిక మాట్లాడుతూ తమ సంస్థ 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందన్నారు. వనమాలి సీటీజీ సంస్థ విద్యార్థులకు మొక్కలు పంచిపెట్టారు. కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం, కోఆర్డినేటర్ జె.రాజేశ్వరి, వనమాలి సీటీజీ అడ్మిన్ మళ్ల సరిత తదితరులు పాల్గొన్నారు.




