ArticlesGallery

ధర్మాస్త్రం

5views

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం

Telugu NewsEditorial Newsధర్మాస్త్రం
ధర్మాస్త్రం
2 min readEenadu icon
By Editorial Team
Published : 13 May 2026 02:49 IST
Eenadu icon
ధర్మాస్త్రం

సామాజిక మాధ్యమాలు, పోటీ పరీక్షలు, ఉద్యోగ అభద్రత, ఆర్థిక సమస్యలు, విఫల ప్రేమలు, రకరకాల ఒత్తిళ్లు… అన్నీ కలిసి పాముల్లా మనసును బిగించి, మనిషిని నిస్సహాయుణ్ని చేస్తున్నాయి, కలలను స్తంభింపచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన వ్యక్తిత్వాన్ని వికసింపజేసే ధర్మాన్ని అనుసరించాలి. ప్రతి మనిషిలోనూ ఒక గరుడుడు నిద్రిస్తున్నాడు. అతణ్ని మేల్కొలపగలిగితే ఏ అధర్మ బంధనమూ నిలవదు. ధర్మం ఛేదించలేని శక్తిలేదని రామాయణ భారతాలు చెబుతున్నాయి.

రామ-రావణ యుద్ధం కేవలం బాణాలు, ఖడ్గాల సంగ్రామం కాదు. అది ధర్మం- అధర్మం మధ్య సంఘర్షణ. రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు అత్యంత శక్తిమంతమైన నాగాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు, అది వేలాది విషసర్పాలుగా విరుచుకుపడి, రామలక్ష్మణులను నిశ్చేష్టులను చేసింది. అటువంటి క్లిష్ట సమయంలో వాయుదేవుడి సూచనతో సర్పజాతికి సహజ శత్రువైన గరుడుడు ఆకాశమార్గంలో దూసుకుని వచ్చాడు. అతడి దర్శనంతోనే సర్పబంధనాలు వీడిపోయి, రామలక్ష్మణులు మేల్కొన్నారు. ధర్మబలం ముందు అధర్మ శక్తులు నిలవలేవని చాటిన సందర్భమది. కాసేపు మూగబోయినా, ఓడిపోకపోవడం ధర్మబలానికి చిహ్నం.

మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడి మరణానంతరం, అశ్వత్థామ కోపంతో నారాయణాస్త్రాన్ని మంత్రోచ్చారణలతో ప్రయోగించాడు. ఆ అస్త్రం నుంచి వేలాది అగ్నిజ్వాలలు బాణాల్లా పాండవ పక్షంపై పడసాగాయి. నారాయణాస్త్రం స్వభావం తెలిసిన కృష్ణుడు ‘అస్త్రం ముందు ఆయుధాలు ఎత్తొద్దు! నమస్కరించండి! వినమ్రతే రక్షణ’ అన్నాడు. పాండవులు తమ ఆయుధాలను భూమిపై ఉంచి తలలు వంచి నమస్కారం చేశారు. విధేయతకు తలొగ్గిన ఆ భీకరాస్త్రం వారిని తాకలేదు. విధేయత చూపని భీముడిపైకి నారాయణాస్త్రం గర్జిస్తూ వస్తుండగా ‘భీమా! నమస్కరించు, లేదంటే నాశనమవుతావ్‌!’ అని శ్రీకృష్ణుడు హెచ్చరించగానే, భీముడు వినయంతో తలను వంచాడు. అస్త్రం శాంతించింది. నిజానికి ఎదిరించేవారికి దివ్యాస్త్రం లోబడదు. దైవాన్ని అంగీకరించే వినమ్రతకే వశమవుతుంది అంటాడు శ్రీకృష్ణుడు. నారాయణాస్త్రం కేవలం ఆయుధం కాదు, ధర్మ పరీక్ష. మన శక్తి ఎంత గొప్పదైనా, అహంకారంతో ఎదురొడ్డితే వినాశం తప్పదనీ; వినమ్రత, భక్తితో దాసోహమంటే రక్షణ దొరుకుతుందనీ చెబుతుంది. నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కూడా వినయం ధైర్యం, నమ్మకం రక్షణ కల్పిస్తాయి.
ఎంత బలమైన సంకెళ్లనయినా తెంచే గరుడుడి శక్తిలా- ఉన్నత విలువలు, సత్యనిష్ఠ, ధైర్యం, నమ్మకం మనలో ఉండాలి. అన్యాయం, అవినీతి, దుర్మార్గం మొదట్లో విజయం సాధించినట్టు కనిపించినా, చివరికి న్యాయమే గెలుస్తుంది. ధర్మనిష్ఠను బోధిస్తున్న పురాణ కథలన్నీ ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. జీవితంలో నాగాస్త్రాల్లాంటి పరీక్షలు వస్తాయి. వాటికి భయపడకుండా లోపలి గరుడుణ్ని మేల్కొల్పాలి. మనలోని ధర్మం, మనస్సాక్షి, కృతనిశ్చయం… అవే ఏ అధర్మ బంధనాన్ని అయినా కరిగించే దివ్యశక్తులు. వాటిని వశం చేసుకోవడానికి భక్తి చక్కని మార్గం. అది మనలో దైవాన్ని నిలుపుతుంది.