
టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగమ నియమాలను పక్కనపెట్టిన కొందరు వ్యక్తులు అనధికారికంగా విగ్రహాల ఏర్పాటుకు యత్నించడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో కొందరు టిటిడి ఉద్యోగులు, అర్చకులు కలిసి అనధికార పనులకు తెరతీశారు. సాధారణంగా టిటిడి నిర్వహించే ఆలయాల్లో ఆగమ నియమాలకు అనుగుణంగా అనుమతి తీసుకుని విగ్రహాల ప్రతిష్ఠాపన, పూజలు నిర్వహిస్తారు. ఆయా ఆలయాల్లో విగ్రహాల ఏర్పాటుకు టిటిడి ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. టిటిడి లో వైఖానస ఆగమం, పాంచరాత్ర ఆగమం, శైవాగమం పద్ధతులను అనుసరించి ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. శ్రీవారు కొలువైన ఆలయాల్లో వైఖానస ఆగమాన్నే అనుసరించాలి. అయితే దిల్లీలోని శ్రీవారి ఆలయంలో ఓవర్గం అర్చకులు, ఉద్యోగులు కలిసి వైజాగ్‌లో తయారు చేయించిన నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసేందుకు యత్నించారు. దీంతో మరోవర్గం అర్చకులు ప్రశ్నించారు. టిటిడి ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. టిటిడి విజిలెన్స్ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. ఆలయంలో పనిచేసే సిబ్బందికి ఏర్పాటు చేసిన స్టాఫ్ క్వార్టర్స్‌లోనూ అనధికార వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై నివేదికను సిద్ధం చేస్తున్నారు. టిటిడి స్థానిక సలహా కమిటీ సభ్యుల ప్రమేయంపైనా దర్యాప్తు చేశారు. నివేదికను తితిదే ఉన్నతాధికారులకు అందించగా చర్యలు తీసుకోనున్నారు.





