
ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. శనివారం మొదలైన ఈ ప్రాజెక్టు పనుల కార్యక్రమంలో చైనా ప్రధాని లీ కియాంగ్ పాల్గొన్నారు. టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్బో (బ్రహ్మపుత్ర) నదిపై చేపడుతోన్న ఈ వివాదాస్పద ప్రాజెక్టు కోసం డ్రాగన్ దాదాపు 1.2 ట్రిలియన్ యువాన్‌లు (సుమారు రూ.14లక్షల కోట్లు) ఖర్చు పెట్టనున్నట్లు అంచనా. ఈ ప్రాజెక్టుపై భారత్, బంగ్లాదేశ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ డ్రాగన్ మాత్రం మొండిగా ముందుకు పోతున్నట్లు కనిపిస్తోంది.
‘చైనా యాజియాంగ్ గ్రూపు’ పేరుతో కొత్తగా ఓ సంస్థను ఏర్పాటు చేసి.. ఈ ప్రాజెక్టు బాధ్యతలు దీనికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం ఐదు డ్యామ్‌లు ఉండనున్నాయి. టిబెట్‌లోని నైంగ్చీ నగరంలో.. భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా దీన్ని చేపడుతున్నారు. ఈ విద్యుత్‌ను బయటకే సరఫరా చేయనున్నప్పటికీ స్థానిక అవసరాలకు కూడా కొంతమేర వినియోగించనున్నట్లు సమాచారం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టు..
భారీ ఖర్చుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలువనుంది. దీనిద్వారా ఏటా 300 బిలియన్ కిలోవాట్-అవర్స్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ఇది చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలో అతిపెద్దదైన త్రీగోర్జెస్ డ్యామ్‌కన్నా మూడురెట్లు భారీది. బ్రహ్మపుత్ర నది ‘గ్రేట్ బెండ్’గా పిలిచే భారీ వంపు ప్రాంతంలో రెండువేల మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది. స్వల్పదూరంలో నిటారుగా పడటంవల్ల అక్కడ జల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశాలున్నాయి.
భారత్ ఆందోళన వ్యక్తం చేసినా..
హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌కు నది గమనంలో వంపు తిరిగే చోట ఈ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. భారీ డ్యామ్ నిర్మాణం వల్ల ఇక్కడి భౌగోళిక ప్రదేశానికి, పర్యావరణానికి తీరని నష్టం కలగవచ్చనే అభిప్రాయాలున్నాయి. దీనివల్ల అరుణాచల్‌తోపాటు అస్సాం రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ సంభవిస్తే చైనా ఈ డ్యామ్ నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదలచేస్తే అక్కడి భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.
మొండిగా ముందుకు..
దీనిపై భారత విదేశాంగ ఇటీవల స్పందిస్తూ.. ఈ ప్రాజెక్టుపై పర్యవేక్షణ కొనసాగిస్తామని, తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు సూచించింది. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని సమర్థించుకున్న చైనా.. ఈ ప్రాజెక్ట్ విషయంలో అనేక శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని, భారత్, బంగ్లాదేశ్‌లపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని తెలిపింది. భారత్‌లో నదీ ప్రవాహంపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.





