News

తిరువణ్ణామలైలో తెలుగు అన్నదాన సత్రం కూల్చివేతపై భక్తుల తీవ్ర ఆగ్రహం

3views

తిరువణ్ణామలై:తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయ సమీపంలో అక్రమ ఆక్రమణల తొలగింపు పేరుతో అధికారులు ఒక ఆంధ్ర, తెలంగాణ అన్నదాన సత్రాన్ని కూల్చివేశారు. ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా అధికారులు బుల్డోజర్లతో వచ్చి సత్రాన్ని నేలమట్టం చేయడంపై భక్తులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం అరుణాచల గిరిప్రదక్షిణకు వచ్చే తెలుగు భక్తులకు ఈ సత్రం ఉచిత భోజనంతో పాటు తక్కువ ధరకు వసతి సౌకర్యాలు అందిస్తోంది.

ఈ కూల్చివేతకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నో ఏళ్లుగా పేదలకు, భక్తులకు సేవ చేస్తున్న స్థలాన్ని అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారని ఒక నిర్వాహకుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఐదు గంటల పాటు అడ్డుకోవడానికి ప్రయత్నించగా, అధికారులు తమపై భౌతిక దాడికి దిగారని వాపోయారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులం కావడం వల్లే తమపై ఈ రకమైన వివక్ష చూపారని, దేవుని భక్తులకు సేవ చేయడం తప్పా అని కన్నీరుమున్నీరయ్యారు. నిరసనగా కొందరు భక్తులు బుల్డోజర్ల ఎదుట నేలపై పడుకుని అడ్డుకోగా, మహిళలు, పురుషులు అధికారుల తీరుపై తమిళం, తెలుగు భాషల్లో మండిపడ్డారు.

ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయం ముందు ఉన్న ఇతర ఆక్రమణలు, ఇతర మతాలకు చెందిన కట్టడాలను వదిలేసి, కేవలం తెలుగు సత్రాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని కూల్చివేశారని పలువురు నెటిజన్లు ఆరోపించారు. అయితే, ఈ స్థలం ఆలయానికి చెందిందని, దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆక్రమణల నుండి స్వాధీనం చేసుకున్నామని హిందూ మున్నాని ప్రతినిధి తెలిపారు. గతంలో తిరువణ్ణామలై గిరివలంబి మార్గంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.