News

భారీ స్థాయిలో దేవాలయాలు, ఆశ్రమాల పునరుద్ధరణ… యూపీ సర్కార్ కీలక రూట్ మ్యాప్

213views

హిందూ దేవాలయాలు, సనాతన ధర్మ వ్యాప్తి విషయంలో యూపీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుది. హిందూ దేవాలయాల పునరుద్ధరణ, పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టి సారించింది. అలాగే జైన మందిరాలు కూడా ఇందులో వున్నాయి. ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్ పై దృష్టి నిలిపింది. అంతగా తెలియని దేవాలయాలను అభివృద్ధి చేసి, కాశీ, అయోధ్య లాగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందులో భాగంగా భృగు మహర్షి ఆశ్రమం (బల్లియా), దుర్వాసో మహర్షి ఆశ్రమం (అజంగఢ్)కి పునరుజ్జీవం కల్పించనుంది ప్రభుత్వం. అలాగే ప్రత్యేకంగా ఎంపిక చేసిన జైన మందిరాల పునరుద్ధరణ కూడా వుంటుంది. వీటితో పాటు బల్లియా, మౌ, అజంఘర్, మహారాజ్ నగర్ ప్రాంతంలో విస్తరించి, అంతగా ప్రాచుర్యంలోకి రాని ఆశ్రమాలను కూడా పునరుద్ధరించి, అభివృద్ధి చేయనున్నారు.

ఇప్పటికే యూపీ పర్యాటక శాఖ దీనిపై కసరత్తు పూర్తి చేసేసింది. వివరంగా ఓ రూట్ మ్యాప్, ప్రణాళికను కూడా రూపొందించింది. అలాగే ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా చాలా ముఖ్యమైన, పవిత్రమైన ప్రదేశాలను ఇప్పటికే గుర్తించింది.

1. బల్లియాలోని భృగు ఆశ్రమం : ఇందులో చిత్రగుప్త మందిరం వుంది. ఇది భృగు మహర్షితో అనుసంధానమై వుంది. అత్యంత అద్భుతమైన ప్రదేశం. దీనిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు.

2. హనుమాన్ మందిర్ కాంప్లెక్స్ : బల్లియా ప్రాంతంలో వుంది. పాత్ వే అభివృద్ధి చేయడం, లైటింగ్ వ్యవస్థ బాగు చేయడం, వసతిని మరింత విస్తరించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు.

3.ఉదాసిన్ మఠం (బసంత్ పూర్) : మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి చేయాల్సిన పనులను ఇందులో పూర్తి చేసేస్తారు.

4. భైరవ్ బాబా స్థల్ : ఇది మహారాజా గంజ్ లో వుంది. తాంత్రికంగా, శైవ సంప్రదాయంలో అద్భుతమైన క్షేత్రం. దీనికి కావాల్సిన అభివృద్ధి పనులు, ఆధ్యాత్మిక మ్యాప్ లో ఇకపై నుంచి దీనిని కూడా చేరుస్తారు.

5. దుర్వాసో మహర్షి ఆశ్రమం : ఇది ఆజంగఢ్, ఫూల్పూర్ పావైలో వుంది. ఈ ఆశ్రమం ధ్యాన కేంద్రంగా వుంది. దీనిని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు.

6. శ్రీ వీర బాబా బ్రహ్మస్థాన్ : దువారి అనే గ్రామంలో వుంది. తీర్థయాత్ర క్షేత్రంగా వుంది. ఇది కూడా అభివృద్ధి చేసే జాబితా వుంది.

7. రామజానకీ మందిర్ : ఆజంగఢ్ లోని మిశ్రాపూర్ ప్రాంతంలో వుంది. సీతారాముల విషయానికి సంబంధించిన ప్రాంతం.

8. ఫూల్మతి దేవి మందిర్ : సదర్ కన్నౌజ్ ప్రాంతంలో వుంది. ఈ మందిరాన్ని కూడా పునరుద్ధరిస్తారు. మౌలిక సదుపాయాలు విస్తరిస్తారు.

9. సాధు సంతుల స్థలాలు : ధన్నిపూర్, సింగపూర్, బన్స్ గావ్, లాంటి ప్రాంతాలు సాధు సంతులతో సంబంధమున్న ప్రదేశాలు. వాటిని కూడా విస్తరిస్తారు.

యూపీ ప్రాంతంలో అయోధ్య, వారణాసి, మధుర క్షేత్రాలు ప్రపంచ వ్యాప్త గుర్తింపును పొందుతున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా అక్కడ ప్రత్యేక దృష్టి నిలిపింది. అయితే.. రాష్ట్రంలోని ఇతర మందిరాలను కూడా బాగా అభివృద్ధి చేసి, పర్యాటక, ఆధ్యాత్మిక మ్యాప్ లో భాగం చేయాలని నిర్ణయించాయి. వేల వేల సంవత్సరాల చరిత్ర వున్న దేవాలయాలను తిరిగి ప్రాచుర్యం చేయాలని ప్రభుత్వం గట్టిపట్టుదలతో వుంది. ఇది కేవలం సుందరీకరణ ప్రాజెక్టు మాత్రమే కాదని, ధర్మం, ఆధ్యాత్మిక క్షేత్రాల పునరుత్థానంగా తాము చూస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.భవిష్యత్ తరాల కోసం ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
ఇలా చేయడం ద్వారా..

1. స్థానికులకు ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. పర్యాటకం అభివృద్ధి అవుతుంది.

2. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రవాణా రంగం కూడా మెరుగవుతుంది.

3. దేవాలయాలతో ముడిపడి వున్న కళాకారులకు పోషణ లభిస్తుంది.

4. అలాగే వీటి కేంద్రంగా వేద సంప్రదాయం, ఆధ్యాత్మిక సంప్రదాయం పునరుద్ధరణ అవుతుంది.