
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2018లో ఇచ్చినదే తుది నిర్ణయంకాదని, ఈ అంశంపై విస్తృత ధర్మాసనం చూస్తుందని సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం తెలిపింది. శబరిమల ఆలయానికి బయల్దేరిన బిందు అమ్మిని అనే మహిళను అడ్డుకోవడంపై దాఖలైన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ గురువారం వాదనలు వినిపించారు. 2018 తీర్పును కాలరాస్తూ ఆమెపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం 2018లో ఇచ్చిన తీర్పు తుది నిర్ణయం కాదని, ఈ అంశం పరిశీలనకు ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశామని ధర్మాసనం పేర్కొంది. ఆ బెంచ్ తుది తీర్పు వెలువరిస్తుందని, ప్రస్తుతానికి ఎలాంటి తుది నిర్ణయాలు లేవని బెంచ్ పేర్కొంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





