ArticlesNews

మురుగ భక్తుల మనోభావాలతో స్టాలిన్ సర్కారు ఆటలు

234views

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మురుగన్ (సుబ్రహ్మణ్యుడు, స్కందుడు) భక్తుల అంతర్జాతీయ సమావేశం జూన్ 22న ఘనంగా జరుగనున్న నేపథ్యంలో మొదట తమిళనాడు సర్కారు ఒత్తిడితో ఆ రాష్ట్ర పోలీసులు అనుమతి నిరాకరించడం, ఆ తర్వాత మద్రాస్ హైకోర్టులో “హిందూ మున్నని” సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌తో ఊరట లభించడం జరిగింది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం జాతీయజెండా ఎగురవేయడం వంటి కార్యక్రమాలకు, హిందువులకు సంబంధించిన కార్యక్రమాలకు నిరంతరం ఏదో ఒక వంకతో నిరాకరిస్తూ వస్తోంది. అక్కడి ప్రభుత్వ తీరుపై హిందూసంఘాలన్నీ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే… భగవాన్ మురుగన్ ఆరు నివాసాల సూక్ష్మచిత్రాలను ఏర్పాటు చేయడానికి, సమావేశ స్థలంలో జూన్ 10 నుండి 22 వరకు పూజలు నిర్వహించడానికి పోలీసుల ద్వారా స్టాలిన్ సర్కారు ఆటంకాలు కల్పించింది. పళనిలో ఇలాంటి కార్యక్రమానికి డిఎంకె ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, మధురై మురుగన్ సమావేశానికి అనుమతి నిరాకరించడానికి పోలీసులకు గల కారణాలను కోర్టు ప్రశ్నించింది. తాజా పరిస్థితితో అక్కడి ప్రభుత్వ రెండునాలుకల ధోరణి ఏమిటనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే, మురుగన్ భక్తులు ఎంతో ఈ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమావేశానికి కారణం ఓ వివాదాస్పద అంశం. అదేంటో చూద్దాం…

మదురై దగ్గర తిరుపరంకుండ్రం అనే ప్రాంతంలో మురుగన్‌కు పుణ్యక్షేత్రం ఉంది. మదురై పక్కనే ఉంటుంది. అక్కడ గత ఫిబ్రవరిలో జరిగిన హిందూ భక్తుల సమావేశం సందర్భంగా పెద్ద వివాదం వెలుగులోకి వచ్చింది. పురాతన తిరుపరంకుండ్రం కొండకు “సికందర్ కొండ”గా పేరు మార్చడానికి కొందరు ముస్లింల ద్వారా జరుగుతున్న నిరంతర ప్రయత్నాలకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా నిరసనను వ్యక్తం చేయడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. భగవాన్ మురుగన్ ఆరు పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుపరంకుండ్రం హిందువులకు ఎంతో ముఖ్యమైన పుణ్యక్షేత్రం, ఈ క్షేత్రం అపారమైన ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మదురై ప్రాంతాన్ని కొంతకాలం నియంత్రించిన ఢిల్లీ సుల్తాన్ సికందర్ షా పేరును ఈ కొండకు పెట్టాలని గత కొంత కాలంగా ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ఇది మాకు చెందినది, మా హక్కు అని కొందరు ముస్లింలు దేవాలయానికి దగ్గర బిర్యానీలు తినడం కొందరు ముస్లిం నాయకులు దాంట్లో, స్వయంగా రామనాథ పురం ఎంపీ ముస్లింలీగ్ పార్టీకి చెందిన వ్యక్తి పాల్గొనడంతో పెద్ద వివాదమైంది. ఎందుకంటే స్కందగిరిగా పేరుపొందిన ఈ కొండ హిందువులకు ప్రముఖమైన పుణ్యక్షేత్రం. అక్కడ వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఈ పేరు మార్చాలనే డిమాండ్‌ను కొన్ని ఛాందసవాద ముస్లిం సంస్థలు, వామపక్ష పార్టీలు, నామ్ తమిజార్ కట్చి, విజయ్ జోసెఫ్, వివిధ ద్రవిడ పార్టీలు ఈ డిమాండ్ ను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సమర్థిస్తున్నాయి. ఈ చర్యలకు హిందూ సమూహాలనుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీరంతా హిందూ వ్యతిరేకులని, పేరుమార్చే డిమాండ్‌కు వీరు మద్దతు పలుకుతున్నారంటూ హిందూ సమూహాలు ఆరోపణలు చేస్తున్నారు.

ఇది జరిగి ఇప్పటికి నాలుగునెలలు కావొస్తుంది. ఈ వివాదంతో పాటు, తమిళనాడులో మురుగన్ దేవాలయాల పరిస్థితులు, మురుగన్ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే పళని క్షేత్రంలో అన్నదానాన్ని రద్దు చేశారు. పలు ఆలయాల్లో వివిధ రకాల ఆంక్షలను పెట్టారు. అంతేకాకుండా రాష్ట్రంలో హిందూ పండుగలపై ప్రత్యేకంగా విధించిన వివక్షతతో కూడిన ఆంక్షలు, షరతులు, కరైకుడి నుండి పళనివరకు హైవే కావాలనే డిమాండ్స్‌తో హిందూ మున్నని ఒక సభ జరపాలని నిర్ణయించింది. అయితే డీఎంకే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. తాజాగా హైకోర్టు తీర్పుతో వారు జూన్ 22న ఐదు లక్షల మందితో మురుగన్ భక్తులు సమావేశం కానున్నారు. అంతేకాకుండా సభకు ముందుగానే స్కందక్షేత్రం అయిన తిరుప్పరంకుండ్రంలో లక్షమంది భక్తులతో స్కందస్తోత్రాన్ని పారాయణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్‌తో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నారనే వార్తలు వస్తున్నాయి.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మదురై పర్యటన సందర్భంగా ఈ వివాదాస్పద అంశంపై మాట్లాడారు. “డిఎంకె ప్రభుత్వం మన వెయ్యి సంవత్సరాల పురాతనమైన తిరుప్పరంకుండ్రం పర్వతానికి సికందర్ పర్వతం అనే పేరు పెట్టడానికి తయారైంది. డిఎంకె ప్రభుత్వం వేర్పాటువాద రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా చేస్తోంది. జూన్ 22న జరగనున్న మురుగ భక్తుల సమావేశంలో మనం పాల్గొని మన బలాన్ని ప్రదర్శించాలి” అని షా ప్రకటించారు, ఈ సమావేశాన్ని విస్తృత రాజకీయ, మతపరమైన అంశంగా అనుసంధానించారు. దీనిపై సీపీఎం ఎంపీ వెంకటేశన్ స్పందిస్తూ తిరుప్పరంకుండ్రం కొండ వేయి సంవత్సరాల నాటిది అని అమిత్ షా అన్నారు కానీ పరాంకుండ్రం అనేది మూడువేల సంవత్సరాల నాటిదని దాని అసలు వయసును తగ్గిస్తున్నారని తమిళ ప్రాచీనతను అమిత్ షా తక్కువ చేసి చూపిస్తున్నారని ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ ఐటీ విభాగం స్పందిస్తూ వెంకటేశన్ ఇది మూడు వేల సంవత్సరాల పురాతనమైనదని అంగీకరిస్తున్నారంటే ఇందులోని ప్రతీ రాయి మురుగన్‌కు మాత్రమే చెంది ఉంటుందని, ఈ స్థలం హిందువులది అంటూ హిందూ వాదనని బలపరిచారు.

ఇదిలా ఉంటే హైకోర్టు అనుమతిచ్చినప్పటికీ ఈ సమావేశాన్ని నిర్వహించకూడదని మదురైకి చెందిన ఒక 40 సివిల్ ఆర్గనైజేషన్లు కలిసి “మధురై రిలిజియస్ సివిలియస్ హార్మొని ఫెడరేషన్” అనే పేరు తోటి ఈ నలభై సంస్థలు కలసి డిస్ట్రిక్ కలెక్టర్‌కు పిటిషన్ ఇచ్చారు. ఇది సామాజిక సమరసతకు విఘాతం కలిగించే అంశం అని కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సభకు అనుమతి ఇవ్వవద్దనేది దాని సారాంశం. అది జరిగేటట్టయితే జూన్ 29న మేము పీపుల్ యునిటీ కాన్ఫరెన్స్ అనేది ఇంకోటి జరుపుతాం దానికి అనుమతి ఇవ్వండి అని వారి వాదన. ఈ మధ్యలో తమిళనాడు దేవాదాయ శాఖామంత్రి శేఖర్ బాబు స్పందించారు. మురుగన్ భక్తుల సమావేశానికి నిజమైన భక్తులు ఎవరూ హాజరు కారని, ఇది రాజకీయ ప్రేరేపితమంటూ… ఒకవేళ ఈ సభలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ప్రభుత్వం బాధ్యత వహించదు…. అంటూ ప్రకటన చేశాడు. దీంతో సాక్షాత్ మంత్రే ఈ విధంగా ఎలా ప్రకటన చేస్తారనే అంశం తెరపైకి వచ్చింది. హైకోర్టు అనుమతిచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం శాంతి భద్రతలను కల్పించదని ఒక ప్రభుత్వ మంత్రి ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్టాలిన్ ప్రభుత్వానికి ఈ సభ జరపడం ఇష్టంలేదని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది.

అసలు హిందువులు ఒక సమావేశం జరుపుకోడానికి కోర్టు ఉత్తర్వుల తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులో ఉంది. పశ్చిమ బెంగాల్ లాగానే తమిళనాడులో కూడా హిందూ వ్యతిరేక శక్తులు తయారవుతున్నారు. అయితే ఇప్పుడు అందరి ఆలోచనా ఏమిటంటే… ఎన్నికలు సంవత్సరం లోపే ఉన్నాయి కనుక, డీఎంకే ప్రభుత్వం తలొగ్గుతుందా లేదా అన్నది. ఎందుకంటే పోయిన సారి ఎన్నికల సమయంలో డీఎంకే పార్టీనే ఓట్ల కోసం “లార్డ్ మురుగన్ కాన్ఫరెన్స్” అని జరిపింది. అప్పుడే చాలామంది నాస్తికవాద డీఎంకే పార్టీ నాయకత్వంలో మురుగన్ కాన్ఫరెన్స్ జరపడం ఏంటని అనుకున్నారు. ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఇంకోలా డీఎంకే వ్యవహరిస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. తమిళనాడు ప్రభుత్వం హిందూ వ్యతిరేకతను ప్రదర్శిస్తుందనడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం లేదు.