
ప్రతి మనిషికీ తన జీవితంలో ‘‘విలువలు’’ అత్యంత ముఖ్యమైనవని, మనిషిని మానవునిగా మార్చేవి కూడా అవే అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు మన్మోహన్ వైద్య అన్నారు. విలువల ఆధారిత సమాజాన్ని నిర్మించడమే విద్య మూల లక్ష్యమని వివరించారు. భారతీయ శిక్షా మండల్ మూడు రోజుల అఖిల భారతీయ సమావేశాలు హైదరాబాద్ లోని కన్హా శాంతివనంలో మూడు రోజుల పాటు జరిగాయి. ఈ సందర్భంగా మన్మోహన్ వైద్య మార్గదర్శనం చేస్తూ.. జీవితంలో శిక్షణ అనేది ఎంతో ముఖ్యమైనదని, కానీ అది విలువలతో వున్నప్పుడే సానుకూల ఫలితాలనిస్తుందన్నారు. నైపుణ్యాలున్న వ్యక్తి ప్రపంచాన్ని ఆకర్షిస్తాడని, అయితే విలువలున్న వ్యక్తి సమాజాన్ని ప్రేరేపిస్తాడని వివరించారు. అలాగే ప్రజల జీవితాల్లో మార్పులు కూడా తేస్తాడని తెలిపారు.
జీవితంలో చిన్న విరామం అనేది అత్యావశ్యకమని, అయితే దానిని ఆత్మ పరిశీలన కోసం వినియోగించుకోవాలని సూచించారు. దీని ద్వారా జీవితం అర్థమవుతుందని, పనిని వేగవంతం చేయడానికి కూడా ఉపకరిస్తుందన్నారు. సమాజం నుంచి తీసుకోవడం కంటే.. తిరిగి ఎక్కువ ఇవ్వడం అన్న భావన కేవలం భారతీయ విలువలతో మాత్రమే సాధ్యపడుతుందన్నారు.
విలువలకు కట్టుబడి వుండటం ద్వారా సమాజానికి ఓ మంచి స్ఫూర్తినిచ్చినట్లు అవుతుందని, అలాగే దేశం పట్ల అంకితభావం, జీవితంలో విలువలు వుంటే దేశం కోసం పనిచేయడానికి సమయాన్ని తీయడం సులభం అవుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా 313 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.అలాగే వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్ ఛాన్స్ లర్లు, వివిధ విద్యా సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థను విలువల ఆధారితంగా నడపడం, అలాగే విద్య ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం, దీని ద్వారా భారతీయ సంస్కృతిని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఈ సమావేశాలు సాగాయి.ఇదే సమావేశంలో వివిధ వర్క్ షాపులు కూడా నిర్వహించారు. విద్యావేత్తలందరూ తమ తమ సలహాలిచ్చారు.





