News

చర్చిగా మారిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు

212views

ఒరిస్సాలోని గిరిజన ప్రాబల్యం ఉన్న కియోంఝర్ జిల్లాలోని బలభద్రాపూర్ పూర్ గ్రామంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం నిర్మించిన ఓ ఇంటిని చర్చిగా మార్చేశారు. ప్రార్థన సమావేశాల కోసం నివాస స్థలాన్ని ఉపయోగించడాన్ని అక్కడి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ మిషనరీలు అక్రమంగా మతమార్పిడులు చేస్తున్నారనీ, ప్రభుత్వ భూమిలో అనధికారికంగా చర్చి నిర్మాణం జరిగిదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నివాసితులు డిమాండ్ చేశారు. పరిస్థితిని శాంతింపజేయడానికి పోలీసులు జోక్యం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే ఒడిశా-జార్ఖండ్ సరిహద్దులో ఉన్న బలభద్రపూర్ అనే గ్రామంలోని ప్రభుత్వ భూమిలో మక్రు ముండా అనే వ్యక్తి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఇల్లు నిర్మించుకున్నాడు. ఇల్లు పూర్తయిన తర్వాత, PMAY సైన్‌బోర్డ్‌ను తొలగించి, దాని స్థానంలో “చర్చి” అనే పదాన్ని చేర్చాడు. తన నివాసాన్ని క్రైస్తవ ప్రార్థన సమావేశాలకు ఒక ప్రదేశంగా మార్చేశాడు. అంతేకాకుండా క్రైస్తవ మిషనరీలు ప్రార్థన సమావేశాలు నిర్వహించుకోవడానికి, దుర్బల గిరిజన గ్రామస్తులను క్రైస్తవ మతంలోకి మార్చకునేలా ప్రభావితం చేయడానికి ఈ ఇంటిని ఉపయోగించుకున్నాడు. ఇది అక్కడ చుట్టుపక్కల వారు గమనించి తమ గ్రామంలో దీనివల్ల మత సామరస్యం దెబ్బతింటుందనీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగం అవుతున్నాయని ఆందోళనలను వ్యక్తం చేస్తూ స్థానిక సమాజం ఈ కార్యకలాపాలను తీవ్రంగా వ్యతిరేకించింది.

గ్రామ సామాజిక వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యంతో సామాజిక, మతపరమైన సమావేశాల ముసుగులో ఈ మతమార్పిడులు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు పదే పదే ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ, జిల్లా యంత్రాంగం ఇటువంటి చట్టవిరుద్ధమైన పద్ధతులపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో విఫలమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే వారికి మరింత ధైర్యాన్నిచ్చింది, దాంతో వారు కార్యకలాపాలను ఎలాంటి అవరోధాల్లేకుండా జరుపుకుంటున్నారు. ఇకనైనా జిల్లా యంత్రాంగం స్పందించి దీనికి తగిన పరిష్కారం చూపేంతవరకు తమ ఆందోళనను ఆపమని స్థానిక సమాజం పేర్కొంటోంది.

ఇటువంటి చట్టవిరుద్ధమైన మతమార్పిడి కార్యకలాపాలను అరికట్టడానికి. ఈ ప్రాంతంలో మత సామరస్యాన్ని పునరుద్ధరించడానికి పరిపాలన నుండి కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ జాగరణ్ మంచ్ డిమాండ్ చేసింది.