
శ్రీలంకతో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో ఆయన దిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో భేటీ అయ్యారు. తొలి విదేశీ పర్యటనకు గొటబాయ భారత్‌ను ఎంచుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నామని మోదీ అన్నారు. తాజా ఎన్నికలలో గొటబాయకు వచ్చిన మెజార్టీ శ్రీలంక ప్రజలు సుస్థిర దేశాభివృద్ధిని కోరుకోవడాన్ని సూచిస్తుందన్నారు. శ్రీలంక సుస్థిరత భారత్ సహా హిందూ మహాసముద్ర ప్రాంతానికి ఎంతో కీలకమన్నారు. శ్రీలంక అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీలంకలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అక్కడి తమిళుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరుకు సహకారంగా 50 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించారు.
గొటబాయ మాట్లాడుతూ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక, భద్రతాపరమైన సహకారంపై ఫలవంతమైన చర్చలు జరిగాయన్నారు. శ్రీలంక అధీనంలో ఉన్న భారత మత్స్యకారుల పడవలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. శ్రీలంక ఆర్థికాభివృద్ధి, భద్రత విషయంలో భారత్‌తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం రాత్రి గొటబాయ భారత్‌కు చేరుకున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ స్వాగతం పలికారు.
అంతకుముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌తో గొటబాయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీలంకతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తద్వారా శ్రీలంకలో ఉన్న తమిళుల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని వెల్లడించింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





