
అక్రమ వలసదారులను గుర్తించేందుకు భారత్ చేపడుతున్న జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) విషయంలో తాము జోక్యం చేసుకోబోమని బంగ్లాదేశ్ తెలిపింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ రాయబారి సయ్యద్ మౌజమ్ అలీ మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీ చేపట్టిన తర్వాత ఎవర్నీ తమ దేశానికి పంపలేదన్నారు. భవిష్యత్‌లోనూ ఎవర్నీ పంపబోరని, ఇది భారత అంతర్గత విషయమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇది పూర్తిగా దేశ అంతర్గత విషయమని, ఈ సమస్యను తామే పరిష్కరించుకుంటామని ఇది వరకే భారత్ తమ దేశానికి తెలియజేసిందన్నారు. కాబట్టి దీనిపై బంగ్లాదేశ్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే భారత్‌కు సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో బంగ్లాదేశ్ జోక్యం చేసుకోబోదని ఆయన పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులను గుర్తించేందుకు అసోంలో ఎన్‌ఆర్‌సీ చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగస్టు 31న వెలువడిన తుది జాబితాలో సుమారు 19 లక్షల మందికి చోటు దక్కలేదు. దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ చేపడతామని అధికార భాజపా నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





