
భారత్‌లో విస్తరించిన పాకిస్తాన్ నిఘా సంస్థలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న పలువురిని అరెస్ట్ చేశారు. ఇక, తాజాగా మరో ప్రభుత్వ ఉద్యోగి గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయ్యాడు. అతడి ఫోన్‌లో పాకిస్తాన్‌కు చెందిన పలు నంబర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సకూర్ ఖాన్ మగళియార్ గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయ్యాడు. సకూర్ ఖాన్ స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. తాజాగా సకూర్ ఖాన్‌ను సీఐడీ, ఇంటెలిజెన్స్ బృందాలు అదుపులోకి తీసుకొన్నాయి. ఈ సందర్బంగా ఎస్పీ సుధీర్ చౌధ్రీ మాట్లాడుతూ.. సకూర్‌ఖాన్‌పై గత కొన్ని వారాలుగా దర్యాప్తు బృందాలు నిఘా పెట్టాయి. అతడికి పాక్ దౌత్య కార్యాలయంతో సంబంధాలపై కూడా సందేహాలున్నాయి. సకూర్ అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఉన్నత స్థాయి నుంచి సమాచారం అందింది. దీంతో వాటిని ప్రశ్నించి.. నిర్ధారించుకునేందుకు అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
ఇక, సకూర్ ఖాన్ ఫోన్‌లో పలు పాకిస్థానీ నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి గురించి సంతృప్తికరమైన వివరణ మాత్రం అతడి నుంచి రావడం లేదని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. పాక్‌ను దాదాపు ఏడుసార్లు సందర్శించినట్లు అతడు అంగీకరించాడు. ఇప్పటివరకు అతడి ఫోన్‌లో ఎటువంటి మిలిటరీ సమాచారం లేదని అధికారులు వెల్లడించారు. కాకపోతే కొన్ని ఫైల్స్‌ను అతడు డిలీట్ చేసినట్లు గుర్తించారు. ఇక ఖాన్‌కు ఉన్న రెండు బ్యాంకు ఖాతాలపై దృష్టిసారించారు.