
పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్‌లో చేస్తున్న గూఢచర్యం తవ్వేకొద్దీ బయటకొస్తోంది. భారత్‌లో వినాశకర వాతావరణం సృష్టించడమే లక్ష్యంగా భారత పౌరులనే టార్గెట్ చేసుకుని పెద్ద నెట్ వర్క్ నడుపుతోందీ సంస్థ. భారత పౌరులకు రకరకాల ఆశలు చూపి తన దారిలోకి తెచ్చుకుని భారత రహస్యాలు చేజిక్కించుకుంటోంది. ఇటీవల కాలంలో ఇలా పాక్ వలలో చిక్కుకున్న వాళ్లు చాలా మందే బయటకొస్తున్నారు. కొత్తగా రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పాకిస్థాన్ కోసం స్పై కార్యకలాపాలు చేసినట్టు తెలుస్తోంది.
రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్‌లో పనిచేసే సకూర్ ఖాన్ మగళియార్‌ను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను గత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రికి పర్సనల్ సెక్రటరీగా కూడా వ్యవహరించినట్టు సమాచారం. అయితే, దర్యాప్తు వర్గాలు మాత్రం రాజకీయ లింక్‌లపై ఎలాంటి వ్యాఖ్యలు ఇప్పటి వరకూ చేయలేదు. పాక్ సరిహద్దుల్లోని జైసల్మేర్ జిల్లా బరోడా గ్రామం ఇతడి స్వస్థలం. సదరు మాజీ మంత్రిది కూడా ఇదే గ్రామం.
కాగా, సకూర్‌ఖాన్ వ్యవహారాలపై అనుమానం వచ్చిన దర్యాప్తు సంస్థలు గత కొన్ని వారాలుగా నిఘా పెట్టాయి. ఖాన్ మొబైల్‌లో పలు పాకిస్థానీ ఫోన్ నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాక్‌ను దాదాపు ఏడుసార్లు సందర్శించినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఇప్పటివరకు అతడి ఫోన్‌లో ఎటువంటి మిలిటరీ సమాచారం లేదని అధికారులు చెప్పారు. అయితే, అతను కొన్ని ఫైల్స్‌ను అతడు డిలీట్ చేసినట్లు గుర్తించారు. ఇక ఖాన్‌కు ఉన్న రెండు బ్యాంకు ఖాతాలను విశ్లేషిస్తున్నారు.