
( మే 12 – అన్నమాచార్య జయంతి )
తాళ్లపాక అన్నమయ్య తిరుమల వాసుడిలోనే అందరి దేవుళ్లను దర్శించుకున్నాడు. శ్రీనివాసుణ్ణే కాదు సకల దేవతలనూ సంకీర్తించి పరవశించి పోయాడు. పురాణాలు ప్రస్తావించిన శ్రీమహావిష్ణువు అవతారాలను తన సంస్కృత, తెలుగు కీర్తనల్లో వర్ణించాడు. తన మధురభక్తి పదాల్లో ఒక్కో అవతారాన్ని తలచుకుంటూ తన్మయుడైపోయాడు. ఇలా తన కీర్తనల్ని వినేవారికి, చదివేవారికి పరోక్షంగా పురాణ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, దేవదేవుడి దివ్య అవతారాలను దర్శింపచేశాడు. ‘వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి’ అంటూ మత్స్యావతారాన్ని, ‘చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి..’ అంటూ పాలకడలిని చిలికే కొండ కింద చేరి మునిగిపోకుండా కాపాడావంటూ కూర్మావతారాన్ని, ‘కలికి యగు భూకాంత కౌగిలించిన చేయి..’ అంటూ వరాహ అవతారాన్ని స్మరించుకున్నాడు. ‘బలిచేత దానమడిగిన చేయి’ అని పరవశంతో వామన అవతారాన్ని వినుతించాడు. ‘ఒనరంగా భూదానమును చేసిన చేయి…’ అని బ్రాహ్మణులకు భూమిని దానం చేసిన పరశురామ అవతారాన్ని ప్రస్తుతించాడు. బలరామ అవతారంలో స్వామి నాగలిని ధరిస్తాడని చెబుతూ ‘నాగేలు ధరించు చేయి’ అన్నాడు. నరసింహ, రామ, కృష్ణ అవతారాలను వర్ణిస్తూ అన్నమయ్య ‘వేదములే నీ నివాసమట విమల నారసింహా..’, ‘నమో నమో లక్ష్మీనరసింహా..’, ‘రాముడు రాఘవుడు రఘుకులుడితడు..’, ‘రాముచంద్రుడితడు రఘువీరుడు..’, ‘ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు..’, ‘చిన్ని శిశువు, చిన్ని శిశువు..’ తదితర అపురూప సంకీర్తనలెన్నో రచించాడు.