
తిరుమలలో నిత్యం వివాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఇది రాష్ట్రానికే అరిష్టమని సాధు పరిషత్ అధ్యక్షుడు సాధు శ్రీనివాసనాథ సరస్వతి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ లబ్బీపేట వేంకటేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో ‘హిందూ ధర్మం.. గోమాత విశిష్టత’ అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనాథ సరస్వతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన సాధువులు పాల్గొన్నారు. అనంతరం సాధు శ్రీశివానంద సరస్వతి మాట్లాడుతూ.. తిరుమలలో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా కైంకర్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచే శారు. ప్రతి నెలా గోవులు మరణిస్తుంటే కాకతాళీయం అంటూ కప్పిపుచ్చుతున్నారని విమర్శించారు. మన గుడి – మన గోవు, మన ధర్మం నినాదం ఇంటింటా మారుమోగాలని సూచించారు.
అవధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఆలయంలో గోవులను పెంచాలని, వాటి నిర్వహణను గోసంరక్షకులే చూసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో దయానంద సరస్వతి, పూర్ణానంద స్వామి, శివస్వామి, లక్ష్మీశివనందస్వామి, స్వామి సత్యజ్ఞానానంద. ఆత్మానంద స్వామి, సత్యనారాయణ స్వామి, ఓంకార స్వామి పాల్గొన్నారు.





