
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలపై బంగ్లాదేశ్‌కు చెందిన ఒక అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడానికి బదులు బంగ్లా తమ దేశంలోని మైనార్టీల హక్కులను కాపాడటంపై దృష్టి సారించాలని విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ హితవు పలికారు. విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈవిధంగా బదులిచ్చారు.
బెంగాల్‌లోని పరిస్థితులపై బంగ్లాదేశ్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం ఇటీవల మాట్లాడారు. భారత్‌లోని మైనారిటీలను రక్షించేందుకు అక్కడి కేంద్రంతో పాటు పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపైన తాజాగా జైస్వాల్ స్పందిస్తూ.. ‘పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఘటనలకు సంబంధించి బంగ్లా అధికారులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వారి వ్యాఖ్యలు అర్థరహితమైనవి. ఆ దేశంలోని మైనారిటీలపై జరుగుతున్న హింస గురించి భారత్ తన ఆందోళనను తెలుపుతోంది. ఈక్రమంలో వారు తిరిగి మాపై ఇలాంటి నిందలు వేయడం మానుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి బదులు వారు తమ సొంత దేశంలో మైనారిటీల హక్కులను కాపాడటంపై దృష్టిసారిస్తే మంచిది’ అని పేర్కొన్నారు.
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హూగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈక్రమంలోనే ముర్షిదాబాద్ ప్రాంతంలో పోలీసు వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలతో అక్కడ విధ్వంసం చోటుచేసుకుంది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని బెంగాల్‌లో అమలుచేయబోమని పునరుద్ఘాటించారు. అయితే ఈ హింసలో ఉగ్రసంస్థల హస్తం ఉందని, వారే యువకులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.





