News

రష్యా కీలక నిర్ణయం.. తాలిబన్లపై నిషేధం ఎత్తివేత

225views

20 ఏళ్ల క్రితం తాలిబన్లను నిషేధిత సంస్థగా ప్రకటించిన రష్యా ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. రష్యా అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాసిక్యూటర్ జనరల్ ఇగోర్ క్రాస్నోవ్ దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా గురువారం విచారణ జరిగిన తర్వాత కోర్టు తన తీర్పు వెల్లడించింది. ఇటీవలి కాలంలో రష్యన్ అధికారులు, తాలిబన్ ప్రతినిధుల మధ్య జరిగిన దౌత్యపరమైన మార్పిడి తర్వాత తాలిబన్‌ను ఉగ్రవాద జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే రష్యా నిషేధాన్ని ఎత్తివేయడం గమనార్హం. దీంతో తాలిబన్లకు పెద్ద దౌత్య విజయం లభించినట్టు అయింది.

కాగా, 2003లో రష్యా తాలిబన్లను నిషేధించగా అప్పటి నుంచి ఈ బ్యాన్ అమల్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మధ్యప్రాచ్యం వరకు అనేక దేశాల్లో ఉన్న ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపుల నుంచి భద్రతా పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నందున, తాలిబన్లతో కలిసి పనిచేయాలని రష్యా భావిస్తోంది. 2021లో ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టారు. ప్రస్తుతం ఏ దేశం కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. కానీ రష్యా మాత్రం క్రమంగా వారితో సంబంధాలు మెరుగుపర్చుకుంటోంది.