
“భారత్- థాయ్‌లాండ్ మధ్య శతాబ్దాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. సాంస్కృతక, ఆధ్యాత్మిక సంబంధాలతో బలమైన బంధం ఏర్పడింది. బౌద్ధమతం వ్యాప్తి మన ప్రజలను అనుసంధానించింది. అయుతయ నుంచి నలంద వరకు మేధావులు రాకపోకలు సాగించారు. రామాయణ గాథలు థాయ్ ప్రజల జీవితాల్లో ఒక భాగమయ్యాయి. సంస్కృతం, పాళీ భాషల ప్రభావం నేటికీ ఇరువురి సంప్రదాయాల్లో ప్రతిబింబిస్తుంది” అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
బిమ్స్‌టెక్ సదస్సులో భాగంగా థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని థాయ్ ప్రజల జీవితాల్లో రామాయణ ఇతిహాసం లోని గాథలు భాగమని తెలిపారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలకు చెందిన 7 దేశాల సమాగమం అయిన బంగాళాఖాత ప్రాంత బహుళ రంగ, సాంకేతిక, ఆర్థిక సహకార (బిమ్‌స్టెక్) సదస్సు కోసం రెండు రోజుల పాటు గురువారం మోదీ థాయ్‌లాండ్‌కు వెళ్లారు.
ప్రధానుల భేటీ తర్వాత మోదీ మాట్లాడుతూ “నా పర్యటన సందర్భంగా 18వ శతాబ్దపు రామాయణ కుడ్య చిత్రాల ఆధారంగా ఒక స్మారక స్టాంపును విడుదల చేసిన థాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని హర్షం వ్యక్తం చేశారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండోఫసిఫిక్ విజన్‌లో థాయ్‌లాండ్‌ది కీలక పాత్ర అని ప్రధాని చెప్పారు.
తమ రెండు దేశాలు అభివృద్ధి వాదాన్ని సమర్థిస్తాయని, విస్తరణ వాదాన్ని కాదని చైనాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇటీవల సంభవించిన భూకంపంలో మృతి చెందిన వారికి భారత్ తరఫున సంతాపం తెలియజేశారు.
బిమ్‌స్టెక్ సదస్సులో భారత్‌తోపాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్ దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. బ్యాంకాక్ పర్యటనలో భాగంగా మోదీ పదవ ‘రామ’ గా కూడా ప్రసిద్ధుడైన థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కోమ్‌ను కలుస్తారు.





