
తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. చర్చి ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తూ విద్యాదాఘాతంతో నలుగురు యువకులు మృతిచెందారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా ఎనాయం పుతేంతురైలోని సెయింట్ ఆంథోనీ చర్చి పండగను నిర్వహించాలని పాస్టర్లు భావించారు.
ఈ మేరకు ఏర్పాట్లన్నీ చకాచకా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ పనుల్లో జీసస్ ఫాలోవర్లు, స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పండగ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన రథంపై ఏసుక్రీస్తును ఊరేగిస్తుంటారు. దీంతో రథానికి సుందరీకరణ పనులు చేసేందుకు కొంతమంది యువకులు సిద్ధమయ్యారు. పనుల కోసం ఇనుప నిచ్చెనను తీసుకెళ్తుండగా హైవోల్టేజీ వైర్లకు అది తగిలింది. దీంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. గిలగిలా కొట్టుకుంటూ కాలిపోతూ ప్రాణాలు విడిచారు.
మృతులను మైఖేల్ పింటో, మరియా విజయన్, బి.శోభన్, ఆంటోనీగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.





