
ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో, దానికి దన్నుగా నిలవడంలో సాంకేతికత ప్రధానపాత్ర పోషిస్తే మన సమాజానికి అది శ్రేయం. అలాకాకుండా సాంకేతికతను దుర్వినియోగం చేస్తే అది సంఘాన్ని భ్రష్టుపట్టిస్తుంది. ఒకప్పుడు ముందస్తు ప్రణాళికతో డబ్బు కూడబెట్టుకుని దూరాభారాలు లెక్కించకుండా దైవ దర్శనానికి వెళ్లేవారు. అక్కడ గదులు పొందడం నుంచి దర్శనం వరకూ ఎన్నో అగచాట్లు పడేవారు. అలాంటిదిప్పుడు అన్ని సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడంతో దైవదర్శనానికి వెళ్లి రావడం సులువైపోయింది. ఒకవేళ ఏ కారణంగానైనా ప్రయాణం చేయలేనివారు ఆన్‌లైన్‌లో పైకం చెల్లించి కావాల్సిన సేవలు నమోదు చేసుకుంటే, మన తరఫున ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రసాదాలు సైతం ఇంటికే వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు మనకు కొన్ని ప్రముఖ దేవాలయాలే తెలిసేవి. ఇప్పుడు మారుమూల పల్లెల్లోని గుళ్లను, దేవతామూర్తులను, అక్కడి విశేష పూజలను, వేడుకలను యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో చూడగలుగుతున్నాం. ఎక్కడ ఏ ఆధ్యాత్మిక ప్రసంగం, సత్సంగం, ప్రవచనం జరిగినా అవన్నీ మన కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఆధ్యాత్మికతా వ్యాప్తికి సాంకేతిక ప్రగతి తనవంతు సాయమందిస్తోంది.
అయితే బొమ్మతో పాటు బొరుసుంటుంది. సాంకేతికతను ఆలయాల్లో దుర్వినియోగపర్చడం క్షమార్హం కాని నేరం. అది మన ఆధ్యాత్మిక సంపద విలువను తగ్గిస్తుంది. కొన్ని దేవాలయాల్లో ఛాయా చిత్రాలు తీయకూడదని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంటుంది. అయినా కొంతమంది చాటుగా ఆ పని చేస్తూనే ఉంటారు. గర్భాలయాల్లోని దేవుళ్ల విగ్రహాలను కొన్ని అనూచానంగా పాటిస్తున్న, నియమిత విధి విధానాలతో ప్రతిష్ఠిస్తారు. ఆ మూలమూర్తులను సైతం రహస్యంగా ఫోనుల్లో బంధించి ఏదో సాహసం చేసినట్టుగా భావిస్తుంటారు కొందరు. తప్పు చేయడం గొప్ప ఎన్నటికీ కాదు.
గుళ్లూ, గోపురాలు, ఆలయాలూ, తీర్థాలు అంటే భక్తికి, ముక్తికి మూలస్థానాలు. ప్రతి ఆలయానికీ ఒక చరిత్ర, స్థల పురాణం ఉంటాయి. వీలుంటే అవి తెలుసుకోవాలి. మహాత్ములు, పుణ్యపురుషులు తిరుగాడిన ప్రదేశంలో మనం చరించే అవకాశం కల్పించిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందరూ అన్నిచోట్లకీ వెళ్లలేరు. దైవ దర్శనానికీ ప్రాప్తం ఉండాలి. మనకు ఆ అవకాశం రావడాన్ని అదృష్టంగా భావించి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లినప్పుడు త్రికరణశుద్ధిగా ఉండాలి. అల్లర్లు, గొడవలకు ఆస్కారం ఇవ్వకుండా- అక్కడి వాతావరణానికి, ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా నడచుకోవాలి. మనం శారీరకంగా, మానసికంగా సేదదీరాలంటే అనేక ఉద్యానవనాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ మనం ఎలా కావాలంటే అలా ప్రవర్తించవచ్చు. ఆధ్యాత్మిక ప్రదేశాల ప్రాశస్త్యాన్ని, శోభను మన సందర్శన ఇనుమడింపజేయాలేగాని, మసకబారేలా చేయకూడదు. కళ్లారా దైవాన్ని దర్శించి వచ్చిన తరవాత ఎప్పుడు తలచుకున్నా కళ్లముందు ఆ పరమాత్మరూపం ప్రత్యక్షమవ్వాలి, చేతులు ముకుళితమవ్వాలి. అప్పుడే భక్తి ఆధ్యాత్మికోన్నతికి సోపానమవుతుంది. అదే ముక్తిదాయకం అవుతుంది.





