
సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్1.. సౌర గోళానికి సంబంధించిన అద్భుత చిత్రాలను అందించింది. సూర్యుడి దిగువ పొరల్లో ఉత్పన్నమైన ఒక సౌర జ్వాలను క్లిక్‌మనిపించింది. సూర్యుడిలో సంభవించే విస్ఫోటక చర్యల గురించి ఇది లోతైన అంశాలను వెలుగులోకి తెచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
సౌర జ్వాలలనేవి భానుడిలో భారీ విస్ఫోటాలు. వీటి ద్వారా శక్తి, కాంతి, అత్యంత వేగవంతమైన రేణువులు రోదసిలోకి దూసుకొస్తాయి. తద్వారా అంతరిక్ష వాతావరణంపై ప్రభావం చూపుతాయి. పుడమిపై రేడియో కమ్యూనికేషన్లు, కక్ష్యలో ఉపగ్రహ కార్యకలాపాలకు అవరోధం కలిగిస్తాయి. సౌర జ్వాలలు.. సూర్యుడిపై దేదీప్యమానంగా కనిపిస్తుంటాయి. ఆదిత్య-ఎల్1లోని సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోపు (సూట్) అనే పరికరం ఫిబ్రవరి 22న ఈ సౌరజ్వాలను క్లిక్‌మనిపించినట్లు పుణెలోని ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐయూసీఏఏ) పరిశోధకులు తెలిపారు. ఇది ఎక్స్6.3 తరగతి సౌర జ్వాల అని, అత్యంత తీవ్రమైన విస్ఫోటాల జాబితాలో ఇది చేరిందని వివరించారు. ఈ జ్వాలలో దేదీప్య కేంద్ర భాగాన్ని కూడా గుర్తించామన్నారు.





