
అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థికసాయం అందించే యూఎస్ ఎయిడ్ -USAID) ద్వారా వృథా ఖర్చులు ఎక్కువవుతున్నాయని, అది నేరగాళ్ల సంస్థ అని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా వేలమంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేటు వేశారు. అయితే యూఎస్‌ఎయిడ్ ఫెడరల్ ఉద్యోగులపై హౌస్ కమిటీ విచారణ సందర్భంగా సమర్పించిన నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసినప్పటినుంచి ఇప్పటివరకు యూఎస్‌ఎయిడ్ నుంచి ఆ ఉగ్రవాద సంస్థకు 2 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం అందినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో ఈ నిధులు కేటాయించినట్లు వెల్లడించింది. ఈ సంస్థ నుంచి భారత్ వ్యతిరేకి, యూఎస్ ఉగ్రసంస్థగా ముద్ర వేసిన ఫలా ఎ ఇన్సానియత్ ఫౌండేషన్‌కు(ఎఫ్ఐఎఫ్) సైతం నిధులు వెళ్లాయని.. ఇది పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబా కోసం పనిచేసే ఓ విభాగమని నివేదికలు వెల్లడించాయి. 26/11 ముంబయి ఉగ్రదాడి సహా దేశవ్యాప్తంగా పలు ఉగ్రదాడులకు ఎల్‌టీఈ బాధ్యత వహించిన విషయం తెలిసిందే. వీటిపై అగ్రదేశం నిషేధం విధించినప్పటికీ యూఎస్‌ఎయిడ్ ఈ సంస్థలకు నిధులు సమకూరుస్తుండడం గమనార్హం.
యూఎస్ ఎయిడ్‌కు మిషిగాన్‌లోని ఇస్లామిస్ట్ స్వచ్ఛందసంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ రిలీఫ్ అండ్ డెవలప్‌మెంట్ -HHRDతో సంబంధాలు ఉన్నాయని దీనిద్వారా ఉగ్రవాద సంస్థ ఎఫ్ఐఎఫ్ సహా పలు జిహాదీ సంస్థలకు నిధులు మంజూరుచేసిందని మిడిల్ ఈస్ట్ నిపుణుడు అమ్జద్ తాహా వెల్లడించారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఖర్చులను తగ్గించడానికి పనిచేస్తున్న మస్క్ నేతృత్వంలోని డోజ్ అనేకమంది ఉద్యోగులను తొలగించింది. అయితే యుఎస్ ఎయిడ్ ద్వారా అనవసర వృథా ఖర్చులు పెరుగుతున్నాయని మస్క్ ఆరోపించగా ఆయన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించారు. యూఎస్ ఎయిడ్ ద్వారా ప్రపంచదేశాలకు అమెరికా అందిస్తున్న సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.





