ArticlesNews

కైలాసానికి ఆ పేరెలా వచ్చింది?

417views

హిమాలయాల్లో ఉండే కైలాస పర్వతం పార్వతీ పరమేశ్వరుల నిలయమన్నది పురాణ వచనం. కైలాసానికి ఆ పేరెలా వచ్చిందో వరాహ తదితర పురాణాలు చక్కగా వివరించాయి. జలంలోనూ, భూమిపైనా స్థితమైన దాన్ని ‘కేలాస’ అంటారు. కేలాస పదానికి స్ఫటిక అనే అర్థం కూడా ఉంది. అంటే హిమాలయాలపై మంచు కేలాస రూపంలో ఉంటుంది కనుక ఆ ప్రాంతానికి కైలాసం అనే పేరు స్థిరపడింది. వరాహాది పురాణాలతో పాటు అనేక కావ్యాల్లో కైలాస పర్వత ప్రస్తావన కనిపిస్తుంది. వాల్మీకి రామాయణం కిష్కింధకాండలో సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు శతబల వానరసేనను ఉత్తరదిశగా పంపే సందర్భంలో కైలాస పర్వతాన్ని ప్రస్తావించాడు.

భారతంలో పాండవుల గంధమాదన యాత్ర తదితర అనేక సందర్భాల్లో కైలాస పర్వత ప్రస్తావన ఉంది. మహాకవి కాళిదాసు ప్రసిద్ధ రచన ‘మేఘదూతం’లో కైలాసగిరి ఖ్యాతిని తెలియజేశాడు. మహాభారతంలో కైలాస పర్వతాన్ని ‘హేమకూటం’ అని అభివర్ణిస్తే.. కొన్ని పురాణాలు ‘గణ పర్వతం’, ‘రత్నాద్రి’ మొదలైన పేర్లతో ప్రస్తుతించాయి. కృతయుగంలో మాంధాత, త్రేతాయుగంలో రావణ, భస్మాసురులు శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు కైలాసంలో తపస్సు చేశారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, వ్యాసమహర్షి కైలాస పర్వతాన్ని దర్శించారు.