
ప్రయాగ్‌రాజ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న మహాకుంభ్‌ను ‘మృత్యుకుంభ్’గా సంబోధిస్తూ అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. బీజేపీతో పాటు పలు హిందూ ధార్మిక సంస్థలు మమత వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అఖిల్ భారతీయ సంత్ సమితి తీవ్ర ఆక్షేపణ తెలిపింది. మమతా బెనర్జీ రాజకీయ ఆశలకు రాబోయే పశ్చిమబెంగాల్ ఎన్నికలే చివరివవుతాయని హెచ్చరించింది.
పశ్చిమబెంగాల్, జార్ఖాండ్, బీహార్, ఒడిశా హిందువులంతా మహాకుంభ్ అమృత స్నానాలకు తరలివచ్చారని, ఇంత పెద్దఎత్తున మహాకుంభ్‌రకు వస్తుండటంతో సహజంగానే మమతకు దిక్కుతోచడం లేదని అఖిల్ భారతీయ సంత్ సమితి చీఫ్ స్వామి జితేంద్రానంద సరస్వతి వ్యాఖ్యానించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆమె రాజకీయ ఆకాంక్షలకు ‘మృత్యుకుంభ్’ అవుతాయని హెచ్చరించారు.
మమత ఏమన్నారు?
పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా నిర్వహణపై కూడా అక్కడి బిజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మమత తప్పుపట్టారు. నిర్వహణా లోపాల వల్ల మహాకుంభ ‘మృత్యుకుంభ్’గా మారుతోందంటూ విమర్శించారు.





