
విసర్జితాల కారణంగా ప్రయాగ్‌రాజ్‌లో పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయంటూ వస్తున్న ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖండిచారు. నదీ జలాలపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. నదీ జలాలు స్నానాలకే కాకుండా తాగేందుకూ అనుకూలంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదిలో ప్రమాదకర స్థాయిలో ‘ఫేకల్ కోలిఫాం’ బ్యాక్టీరియా ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ).. జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.
ఈ నివేదికపై ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇప్పటికే 56.25 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు చెప్పారు. స్నానాలు చేసిన పలువురు భక్తులు, ప్రముఖులు అక్కడి ఏర్పాట్లపై ప్రశంసించినట్లు చెప్పారు. సనాతన ధర్మం, మా గంగ, దేశం, మహాకుంభ్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసినా, నకిలీ వీడియోలను ప్రదర్శించినా 56 కోట్ల మంది ప్రజల విశ్వాసంతో ఆడుకున్నట్లే అని వ్యాఖ్యానించారు.
ఇక ఇదే సందర్భంగా ‘మహాకుంభ్’పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలనూ యోగి ఆదిత్యనాథ్ తిప్పి కొట్టారు. ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. మహాకుంభ్‌కు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు. అదేవిధంగా మహాకుంభమేళాను ‘అర్థం లేని’ కార్యక్రమంగా అంటూ రాష్ట్రీయ జనతాదళ్-RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అభివర్ణించారు. ఇక పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం మహాకుంభ్‌ను ‘మృత్యు కుంభ్’ అంటూ వ్యాఖ్యానించారు. వీరు చేసిన విమర్శలకు యోగి స్పందిస్తూ.. ‘సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం నేరమైతే.. మా ప్రభుత్వం ఆ నేరం చేస్తూనే ఉంటుంది’ అంటూ గట్టిగా బదులిచ్చారు.





