News

జ్యోతి క్షేత్రాన్ని కాపాడుకుందాం

393views

జ్యోతి క్షేత్రంలో దేవాలయాల నిర్మాణాలను కూల్చివేయడాన్ని అడ్డుకుందామని అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు నీరజానందస్వామి, సాధుసంతుల పరివార్‌ అధ్యక్షుడు శివకుమారస్వామి, విశ్వ హిందూ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర భజరంగదళ్‌ సెక్రటరీ సందీప్‌ పిలుపునిచ్చారు.వైయస్సార్ జిల్లా కాశి నాయన మండలం జ్యోతి క్షేత్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాశినాయన భక్తులతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎన్నో ఆలయాలను పునరుద్ధరించి అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటుచేసిన అవధూత కాశినాయన ఆలయాన్ని అటవీశాఖాధికారులు కూల్చడం దారుణమన్నారు. నెలకోసారి ఆశ్రమానికి వచ్చి కొన్ని నిర్మాణాలను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. కాశినాయన ఆశ్రమ నిర్మాణం దాదాపు పన్నెండున్నర హెక్టార్లలో జరిగిందని భక్తులు తెలిపారు. ఎంపీ వైఎస్‌.అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి ఆధ్వర్యంలో అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసి ఆలయానికి అవసరమైన భూమి కంటే రెట్టింపు భూమి అటవీశాఖకు ఇస్తామని చెప్పారని వారు పేర్కొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి సత్యకుమార్‌, ఎంపీ సీఎం.రమేష్‌ భూపేంద్రయాదవ్‌ను కలిసి ఆలయ నిర్మాణానికి అనుమతులివ్వాలని కోరారన్నారు. అది పరిశీలనలోనే ఉంది. అయినా అటవీ అధికారులు ఆలయాన్ని కూల్చివేయాలని ఆదేశాలివ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.