News

కనులపండువగా వివేకానందుని శోభాయాత్ర

226views

భారతీయ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానంద స్వామి నేటి తరానికి నిజమైన స్ఫూర్తిగా నిలుస్తారు. వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా రామకృష్ణ మిషన్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నం నగరంలో శోభాయాత్ర జరిగింది. ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద ప్రారంభమైన ఈ యాత్ర బీచ్‌రోడ్డులోని రామకృష్ణ మిషన్‌ వరకు సాగింది. ముందుగా ఈ యాత్రను కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిర ప్రసాద్‌ ప్రారంభించి మాట్లాడారు. వివేకానందుని స్ఫూర్తితో యువతరం ఉన్నతంగా రాణించాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో యువత ఈ యాత్రలో పాల్గొనగా.. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు వివేకానందుని విగ్రహానికి పూలమాలలు, పుష్పాలు అర్పించారు. పలువురు విద్యార్థులు వివేకానందుడు, భారతమాత వేషధారణలో ర్యాలీలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివేకానందుడి సూక్తులతో కూడిన ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. నిలువెత్తు వివేకానందుని విగ్రహంతో యువత ఫొటోలు తీసుకోవడానికి ఆసక్తి చూపారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.సూర్య ప్రకాశరావు, రామకృష్ణ మిషన్‌ ఆశ్రమ కార్యదర్శి స్వామి స్వసమవేద్యానంద, రామకృష్ణ మిషన్‌ స్వామిజీ గీతాసకరానంద, ఎం.సత్యనారాయణ రాజు, ఏయూ ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త ఆచార్య ఎస్‌.హరనాథ్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌. మంజుల తదితరులు పాల్గొన్నారు.