
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమంలో జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహా కుంభమేళా అధికారికంగా ఫిబ్రవరి 26న ముగియనుండగా, ఈ మేళాకు ఆధ్యాత్మిక పరిమళాన్ని అద్దిన 13 అఖాడాల సాధువులు క్రమంగా తిరుగుముఖం పడుతున్నారు. దీనికి సూచికగా ఆయా అఖాడాల ధర్మ ధ్వజాలను వారు అవనతం చేశారు. గత సోమవారం నాటి వసంత పంచమితో తుది అమృతస్నానం ముగిసినందున సంప్రదాయబద్ధమైన కఢీ పకోడా విందుతో సాధువులు తమ స్థావరాలకు తిరుగుపయనం అవుతున్నారు. వీరిలో పలువురు మార్గమధ్యంలో కాశీ, అయోధ్య, బృందావన్, ఆనంద్‌పుర్ సాహిబ్‌లను సందర్శించి పూజలు చేయనున్నారు. కుంభమేళాలో వసంత పంచమి ముగిశాక వచ్చే మాఘ పూర్ణిమ, మహా శివరాత్రి సాధారణ భక్తుల కోసం మాత్రమేనని జునా అఖాడా అంతర్జాతీయ అధికార ప్రతినిధి శ్రీ మహంత్ నారాయణ్ గిరి తెలిపారు. యూపీ ప్రభుత్వ అంచనాల ప్రకారం.. గురువారం నాటికి 39 కోట్లమంది భక్తులు కుంభమేళాను సందర్శించారు.
మణిపుర్, హరియాణా సీఎంల పుణ్యస్నానం
మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్‌సింగ్ తన కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు, నలుగురు భాజపా ఎమ్మెల్యేలతో కలిసి గురువారం త్రివేణీసంగమంలో పుణ్యస్నానం చేశారు. దేశంతోపాటు మణిపుర్ ప్రజల శాంతి, పురోగతి కోసం ప్రార్థించినట్లు బీరేన్‌సింగ్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. హరియాణా సీఎం నాయబ్‌సింగ్ సైనీ కుటుంబసమేతంగా ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి త్రివేణీసంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్సు నుంచి 68 మంది హిందూ భక్తులు మేళాకు విచ్చేశారు.





