News

సంస్కృతి పరిరక్షణ అవశ్యం

314views

విదేశాల్లో ఉన్న పిల్లలకు కూడా భారతీయ సంస్కృతి గురించి అవగాహన ఉందని.. కానీ దేశంలో ఉంటున్నవారు మర్చిపోవడం విచారకరమని శ్రీశైలపీఠం జగద్గురు చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య స్వామీజీ అన్నారు. సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు అందరూ కలిసిరావాలని ఆయనతో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు పిలుపునిచ్చారు. శ్రీకొత్తల బసవేశ్వర భారతీయ శిక్షణ సమితి, భారత వికాస సంగం, వికాస్‌ అకాడమీ సంయుక్తంగా కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లా సేడంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఏడో భారతీయ సంస్కృతి ఉత్సవం ఘనంగా ముగిసింది. గురువారం ముగింపు రోజు దేశ-ధర్మ-సంస్కృతి సమ్మేళనం నిర్వహించారు. భారతీయుల్లో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరుగుతోందని.. ఇలాగే కొనసాగితే మన గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉందని మురుగమఠ్‌కు చెందిన మల్లికార్జున స్వామీజీ ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాలు, సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా జరుగుతున్న దాడి నుంచి మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని హైదరాబాద్‌లోని సచ్చిదానంద యోగా మిషన్‌కు చెందిన మాతా నిర్మలానంద యోగ భారతి అన్నారు.

సామాజిక మాధ్యమాలే ఆయుధంగా..
భారత్‌ను పునర్‌నిర్మించేందుకు సామాజిక మాధ్యమాలను ఒక ఆయుధంగా వాడుకోవాలని పుణెలోని భీష్మ స్కూల్‌ ఆఫ్‌ ఇండియన్‌ నాలెడ్జి సిస్టమ్‌ అధ్యక్షుడు ఆచార్య క్షితిజ్‌ పాటుకలే అన్నారు. భారతదేశ అభివృద్ధి నమూనా పాశ్చాత్య అనుకరణ అని, అందుకే ప్రకృతి కేంద్రీకృత అభివృద్ధికి ప్రాధాన్యమివ్వలేదని తెలిపారు. ఈ పరిస్థితి మారాలన్నారు. వ్యవసాయ సంస్కృతిని కాపాడుకోవడంలో భారతీయ సంస్కృతి ఉత్సవం దోహదం చేస్తుందని రాయచూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ హనుమంతప్ప అన్నారు. విభూ అకాడమీ అధ్యక్షురాలు వి.బి.ఆర్తి, తుమకూరులోని రామకృష్ణ వివేకానంద ఆశ్రమం అధ్యక్షుడు వీరేశానంద సరస్వతి, ఆధ్యాత్మిక గురువు వీణా బన్నంజే, ఐఐటీ ఖరగ్‌పుర్‌ ఆచార్యులు డాక్టర్‌ గణేశ్‌ బగారియా, ప్రఖ్యాత వైద్యుడు కాక్టర్‌ సోమేశ్వర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా వేర్వేరు రంగాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రవాస భారతీయులకు భారత్‌ గౌరవ్‌ పురస్కారాలను ప్రదానం చేశారు.

తొమ్మిది తీర్మానాల ఆమోదం
1) రోజువారీ చర్యల ద్వారా తల్లులపై ప్రేమ, గౌరవం చూపాలి.

2) ఉపాధ్యాయుల సాధికారత.. ఇప్పుడున్న స్థితిని, ప్రేరణను పెంచడానికి మంచి వేతనాలు, నిరంతరం వృత్తిపరమైన శిక్షణ, భారతీయ సంస్కృతి, వారసత్వంపై ప్రామాణికమైన శిక్షణ ఇవ్వాలి.

3) ఉపాధి, వ్యవస్థాపకతను ప్రోత్సహించాలి.

4) దేశీయ పంటల సాగును, వ్యవసాయంలో వైవిధ్యాన్ని ప్రోత్సహించాలి.

5) గ్రామీణ పేదరికం తొలగింపు, రైతుల ఆత్మహత్యల నివారణకు కృషి చేయాలి.

6) దేశీయ ఆరోగ్య విధానాలను పునరుద్ధరించాలి.

7) క్షీణించిన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించాలి.

8) సేవను జీవన విధానంగా చేసుకోవాలి.

9) జీవితానికి మార్గదర్శక సూత్రంగా ధర్మాన్ని పాటించాలి.