News

రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్ర శకటానికి మూడో స్థానం

272views

రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని లో నిర్వహించిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్‌ శకటానికి మూడో స్థానం దక్కింది. రాష్ట్రం ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం పరేడ్‌ను తిలకించేందుకు వచ్చిన అతిథులు, ప్రజలకు ఎంతగానో ఆకట్టుకుంది.

శకటాల ప్రదర్శనలో ఉత్తరప్రదేశ్‌ శకటం మొదటి స్థానం లో నిలవగా, త్రిపురకు రెండో స్థానం దక్కింది.ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం మహాకుంభమేళాకు ప్రచారం కల్పించేలా ‘మహాకుంభ్‌- 2025’ పేరుతో శకటాన్ని ప్రదర్శిచింది.

ఆంధ్రప్రదేశ్‌ శకటం ముందు వినాయకుడు, చివరన శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమలు, రెండు పక్కలా బొబ్బిలి వీణలు, తెలుగు సంస్కృతిని చాటిచెప్పే బొమ్మలకొలువు, చిన్నారుల ఆటపాటల రూపాలు పొందుపరిచారు.

ఏటికొప్పాక బొమ్మల చరిత్ర…
అంకుడు కర్రను ఉపయోగించి చేతితో తయారుచేసే ఏటికొప్పాక బొమ్మలకు 2017లో జీఐ లభించింది. పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్న పాత్రలన్నింటిని ఈ కర్రతో బొమ్మలు చేశారు. చిన్నారులు ఆడుకున్నా గుచ్చుకోని విధంగా గుండ్రటి అంచులు, సహజసిద్ధ రంగులతో తయారుచేసిన ఈ బొమ్మలు పర్యావరణ అనుకూలమైనవి.

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ శకటంగా గిరిజన శాఖ శకటం ఎంపికైంది. త్రివిధ దళాల్లో జమ్మూకశ్మీర్‌ రైఫిల్స్‌ కవాతు బృందం, కేంద్ర బలగాల విభాగంలో దిల్లీ పోలీసు కవాతు బృందం ఉత్తమ మార్చింగ్‌ కంటింజెంట్‌గా ఎంపికయ్యాయి.