News

ఆదివాసీ నాగోబా జాతర

258views

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీ గిరిజనులు అత్యంత నియమ, నిష్టలతో నిర్వహించే నాగోబా జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. అర్ధరాత్రి జరిగిన మహాపూజకు వివిధ రాష్ట్రాల నుంచి ఆదివాసీ, గిరిజనులే కాకుండా గిరిజనేతరులు భారీగా తరలిరావటంతో కేస్లాపూర్‌ భక్తజన సంద్రంగా మారిపోయింది. ఈ జాతర ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగనుండగా ముఖ్యమైన దర్బార్‌ కార్యక్రమం ఈ నెల 31న జరుగుతుంది. దర్బార్‌కు రాష్ట్రమంత్రులు కొండా సురేఖ, సీతక్క హాజరవుతున్నట్లు దేవాదాయశాఖ ప్రకటించింది.

మహాపూజతో ఆవిష్కృతమైన ప్రధాన ఘట్టం : మెస్రం వంశీయుల సంప్రదాయ మహాపూజతో ప్రధాన ఘట్టం ఆవి ఆవిష్కృతమైంది. పుష్యమి అమావాస్య అర్ధరాత్రి ఘడియలో ఆదివాసీ సంప్రదాయాలకనుగుణంగా డోలు, సన్నాయి వాయిస్తూ మెస్రం వంశీయులు నాగోబాకు గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా హారతిని ఇచ్చారు. ఆదివాసీ పూజారులు భక్తులపై గంగా జలం చల్లి సకల శుభాలు కలగాలని దీవించారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజార్షి ప్రత్యేకపూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భారీఎత్తున భక్తులు తరలిరావటంతో కేస్లాపూర్‌ జనారణ్యంగా మారిపోయింది. జాతరకు విచ్చేస్తున్న భక్తులందరికీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ శుభాకాంక్షలు తెలిపారు.