News

రాహుల్‌ గాంధీ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి : సింధియా

286views

బిజెపి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్‌ఎస్‌ఎస్‌ లు దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాజ కుటుంబ వారసుడు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం రాజులకు తప్ప వెనకబడిన వర్గాలకు ఎలాంటి అధికారాలు లేవని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. మహారాజులు ప్రజల కోసం ఏం చేశారో ముందు తెలుసుకొని తరువాత ఇలాంటి వ్యాఖ్యలు చేయాలన్నారు. బరోడా రాజు సాయాజీరావ్‌ గైక్వాడ్ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విద్యకు సాయం చేశారని గుర్తు చేశారు.

1902లో షాహూజీ మహారాజ్ వెనకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి.. సామాజిక న్యాయానికి పునాది వేశారని అన్నారు. గ్వాలియర్ మాధవ్ మహారాజ్ వెనకబడిన తరగతుల సాధికారత కోసం విద్య, ఉద్యోగ కేంద్రాలను స్థాపించారని అన్నారు. ధోల్పూర్ రాజ కుటుంబీకులు సామాజిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కూడా కీలకపాత్ర పోషించారని.. మహారాజ్ రాణా నిహాల్ సింగ్ పరిపాలనను ఆధునికీకరించారన్నారు. అప్పట్లోనే ఆయన రహదారులు, ఆసుపత్రులు, రైల్వేలు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించారని పేర్కొన్నారు.

రాజులు ప్రజలకు చేసిన సహాయాలను విస్మరించడం రాహుల్‌ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటేనని.. ఇప్పటికైనా వాటినుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలపై ఆలోచించాలని సూచించారు. దళితులు, వెనకబడిన తరగతుల వారి హక్కులను కాలరాసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని దుయ్యబట్టారు. రోజూ రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని తిరిగే రాహుల్ అధికార కాంక్షతోనే అలా మాట్లాడుతున్నారని ఎంపీ దుశ్యంత్‌ సింగ్‌ మండిపడ్డారు.