
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి బుధవారం అధిక సంఖ్యలో జనం పోటెత్తారు. ఏకాదశ రుద్రులు ఒకేచోట కొలువైన అపురూప దృశ్యం చూసి తన్మయత్వంతో పులకించారు. 450 ఏళ్ల చరిత్ర ఉన్న వేడుకకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. రంగురంగుల నూలుతో తీర్చిదిద్దిన ప్రభలను భక్తులు భుజాలపై జగ్గన్నతోటకు మోసుకొచ్చారు.
గంగలకుర్రు నుంచి సర్వమంగళ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం నుంచి ఉమాపార్వతి సమేత వీరేశ్వరస్వామి ప్రభలను మోసుకుంటూ యువకులు ఎగువ కౌశిక నదిని దాటించారు. జిల్లావ్యాప్తంగా అంబాజీపేట, చిరుతపూడి, అయినవిల్లి, పి.గన్నవరం మండలం పప్పులవారిపాలెం, అల్లవరం, అమలాపురం గ్రామీణం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, మామిడికుదురు మండలాల్లోని 170 గ్రామాలు ఉత్సవ శోభను సంతరించుకున్నాయి. బాగా ఎత్తుగా ఉండే వాకలగరువు, తొండవరం ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు కార్లు, ఇతర వాహనాలతో పాటు ఎడ్లబళ్లపైనా రావడంతో మొసలపల్లి, ఇరుసుమండ, ముక్కామల రోడ్లలో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది.
జగ్గన్నతోట ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండగగా గుర్తించేలా కృషి చేస్తానని సృజనాత్మకత, సాంస్కృతిక కమిషన్ ఛైర్‌పర్సన్ పొడపాటి తేజస్వి అన్నారు. ప్రభల ఉత్సవాన్ని తిలకించేందుకు ఆమె ఇక్కడకు విచ్చేశారు.