
53views
మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్‌లో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో మంగళవారం స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు నిర్వహించారు. శ్రీవారి నిత్య కైంకర్యాల తరహాలో ఉదయం తిరుప్పావై, తోమాల సేవ, కొలువు, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులను దర్శనాలకు అనుమతించారు. నమూనా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వాహన మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి సాయంత్రం నాలుగు గంటలకు ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు విరాళాలు సమర్పించేందుకు తితిదే కియోస్క్‌ను ఏర్పాటుచేసింది. భక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రూపాయి నుంచి రూ.99,999 వరకు తమకు తోచిన మొత్తాన్ని తితిదేకు విరాళంగా ఇవ్వవచ్చు. ఈనెల 18న ఉదయం 11 నుంచి 12 గంటలకు నమూనా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వేదికపై స్వామికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.