
నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్లు) టికెట్లతో భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొందరు దళారులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు. అనుమానం వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విజిలెన్స్ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కొందరు భక్తులను నిలిపివేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు.. ట్యాక్సీ డ్రైవర్ల ద్వారా నకిలీ టికెట్లు విక్రయిస్తు్న్నట్లు గుర్తించారు.
విచారణలో మరో ఐదుగురు నిందితులను అధికారులు గుర్తించారు. వారిలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కౌంటర్ ఉద్యోగి లక్ష్మీపతి, అగ్నిమాపక శాఖ సిబ్బంది మణికంఠ, భానుప్రకాశ్, ట్యాక్సీ డ్రైవర్లు శశి, జగదీశ్ ఉన్నారు. లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు నకిలీ టికెట్లతో దర్శనానికి పంపుతున్నట్లు గుర్తించారు. మణికంఠ సాయంతో నకిలీ టికెట్లు తయారు చేస్తున్నారని.. ట్యాక్సీ డ్రైవర్లు శశి (తిరుపతి), జగదీశ్ (చెన్నై) ద్వారా భక్తులకు టికెట్లు విక్రయిస్తున్నట్లు తేల్చారు. హైదరాబాద్, ప్రొద్దుటూరు, బెంగళూరుకు చెందిన 11 మంది భక్తుల నుంచి రూ.19వేలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులను తితిదే విజిలెన్స్ అధికారులు, వన్ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు.