
ఏటా సంక్రాతి పూట అయ్యప్ప భక్తులతో పాటు కోట్ల మంది హిందువులు ఆసక్తిగా ఎదురుచూసే మకర జ్యోతి దర్శనం పూర్తయ్యింది. స్వయంగా అయ్యప్ప స్వామే జ్యోతి రూపంలో ప్రత్యక్షమై.. తన కొండకు వచ్చిన భక్తుల్ని కటాక్షిస్తాడని నమ్మకం. అందుకే.. ఎన్నో కష్టాలకు ఓర్చుకుని, ఎంతో నిష్ఠగా స్వామి దర్శనానికి భక్తులు కొండకు చేరుకుంటారు. వారి కోరికల్ని నెరవేరుస్తానని హామి ఇస్తూ, నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ.. స్వామి వారు జ్యోతి రూపంలో దర్శనం ఇస్తారు.
స్వామి వారిని జ్యోతి రూపంలో దర్శించుకునేందుకు వచ్చిన స్వాముల శరణుఘోషతో అయ్యప్ప గిరులు మారుమోగిపోతున్నాయి. కాపాడు అయ్యప్ప.. రక్షించు అయ్యప్ప అంటూ చేసే భక్తుల వేడుకోలకు స్పందనగా.. కొన్ని క్షణాల పాటు దేదివ్యమానమైన వెలుగుతో కనిపించి అదృశ్యమయ్యాడు.. ఆ శివపుత్రుడు అయ్యప్ప. స్వామి దర్శనంతో జన్మ ధన్యమైందంటూ ఆనందంతో భక్తులు ఉబ్బితబ్బిబై పోతున్నారు.
పొన్నాంబల మేడు పర్వతాల పై నుంచి లిప్త కాలం పాటు జ్యోతి దర్శనం కాగా.. వెయ్యి కళ్లత్తో చూస్తున్న భక్తులు మంత్రముగ్ధులు అయ్యారు. పొన్నాంబళం అంటే స్వర్ణ దేవాలయం అని అర్థం. మేడు అంటే పర్వతమని అర్థం. పొన్నంబళమేడు అనే మాటకు.. ధర్మశాస్త అయ్యప్ప స్వామిగా అవతరించిన పురాణ కథలను వర్ణించే జానపదుల నుంచి వాడుకలోకి వచ్చింది.
మకర సంక్రాంతి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్య అయ్యప్ప ఆలయానికి ఈశాన్య దిక్కున పర్వతాల మధ్య నుంచి ఓ జ్యోతి మూడు సార్లు కనిపించి మాయమవుతుంది. ఆ కాంతినే అయ్యప్ప స్వరూపం చూడటానికి భక్తులు.. గంటల తరబడి ఎదురుచూస్తుంటారు. అసలు.. ఆ స్వామిని జ్యోతి రూపంలో దర్శించుకునేందుకే.. అయ్యప్ప మాలతో కొండకు చేరుకునే భక్తులు వేలల్లో ఉంటారు. అలాంటి జ్యోతి దర్శనం చేసుకున్న భక్తులకు జన్మరాహిత్యం కలుగుతుందని హిందువుల బలమైన విశ్వాసం.