News

సాధువుల తొలి పుణ్యస్నానాలు.. ఒక్కరోజే 3.5 కోట్ల మంది భక్తులు

58views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వేదికగా ప్రారంభమైన ‘మహా కుంభమేళా’కు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం మకర సంక్రాంతి పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్నానాలు ఆచరించారు. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. నేడు ఒక్కరోజే దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.

కుంభమేళా సమయంలో పుణ్యస్నానాలకు ప్రత్యేక స్థానముంది. పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలి వచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు. ఈ క్రమంలోనే మంగళవారం ఒంటినిండా భస్మాన్ని పూసుకుని ఈటెలు, త్రిశూలాలు చేతపట్టుకుని డమరుక నాదాల నడుమ వేలమంది నాగ సాధువులు ఊరేగింపుగా పుణ్యస్నానాలకు తరలివచ్చారు. తొలుత పంచాయతీ అఖాడా మహానిర్వాణీ, శంభు పంచాయతీ అటల్‌ అఖాడాకు చెందిన సాధువులు స్నానమాచరించారు. మహా కుంభమేళాలో 13 అఖాడాలు పాల్గొంటున్నాయి. మరోవైపు.. హెలికాప్టర్ల ద్వారా భక్తులపై పూలవర్షం కురిపించారు.

మకర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించిన సాధువులు, భక్తులకు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‘ఎక్స్‌’ వేదికగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్న యంత్రాంగానికి కృతజ్ఞతలు చెప్పారు.