
కుంభమేళా ప్రారంభం
భారతావని త్రివేణి సంగమ పవిత్రభూమి. చతుర్వేదాల జన్మస్థలి. ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రాది మహనీయులు అవత•రించిన అవని. గీతామృతాన్ని పంచిన నేల. పుష్కరాలు, కుంభమేళాలతో శోభిల్లే పుణ్యప్రదాయిని. భారతదేశం ధర్మభూమి, కర్మభూమి. ధర్మాచరణ మన సంస్కృతిలో భాగంగా పరంపరగా వస్తోంది. అతి పురాతన ఈ జాతి చరితలో ప్రతిదీ ఆరాధనీయమే. చెట్టుకు మొక్కినా,పుట్టను పూజించినా, శిలను అర్చించినా…ఒకే భావన. అదే ఆధ్యాత్మికం. ఆ అపూర్వ, అపురూప చింతనాధార నుంచి పురుడు పోసుకున్నవే కుంభమేళాలు, పుష్కరాలు. ఇవి దేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలు.ఆరాధన ఏదైనా జలంతో ముడిపడి ఉండడం అనివార్యం. నీటి బిందువు కేవలం దాహార్తి తీరడానికో, ఆహార దిగుబడికో పరిమితం కాక, అనేకానేక రూపాలలో వ్యక్తమయ్యే దైవం ద్రవీభవించి దర్శనం ఇచ్చే వనరుగా ఈ జాతి సంభావిస్తుంది. నీటిని శరీర ప్రక్షాళన కోసమే కాక, ఆత్మ అభ్యంగానికి సాధనంగా, ప్రతిబిందువునూ సర్వాంతర్యామి నెలవుగా పరిగణిస్తుంది.
హిందూ మతంలో కుంభ మేళాకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. పురాణయుగంలో ఇది వ్యాప్తి చెందింది. ప్రపంచంలోనే ఎక్కువ మంది యాత్రికులు, భక్తులు హాజరయ్యే ఆధ్యాత్మిక సంబరం. అలనాడు చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రారంభ మైన కుంభమేళా కాలక్రమేణ అతిపెద్ద ఉత్సవంలా మారింది. ఆధునిక భారతదేశంలో ఈ పర్వం అపూర్వ స్థాయికి చేరింది. ప్రజలలో నైతిక, ఆధ్యాత్మిక భావనల వృద్ధికి, జాతీయభావన పటిష్టతకు కుంభపర్వం ఉపకరిస్తుందని విజ్ఞులు అంటారు. ఆధ్యాత్మికత, సంప్రదాయాలతో కూడిన ఈ వేడుకల్లో దేశవిదేశీయులు కోట్లాది మంది పాల్గొంటారు.
మధ్యయుగంలో మౌర్య, గుప్త రాజవంశాలు ఈ కుంభమేళాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయని చరిత్ర చెబుతోంది. హర్ష చక్రవర్తి కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్‌ను సందర్శించి వ్యక్తిగత ఆస్తులను దానం చేసేవాడని, ప్రజలలో ధార్మిక భావన పెంపొందించేందుకు ఈ పర్వానికి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాడట. సాధారణ శకం 643 ఫిబ్రవరి-ఏప్రిల్ జరిగిన కుంభమేళాలో ఆయన ధార్మిక పరిషత్తు నిర్వహించాడు. ఆయన కాలంలో జరిగిన పరిషత్తులలో అది ఆరవది అని చారిత్రక కథనం. నాటి కుంభమేళాకు దాదాపు రెండున్నర లక్షల మంది పాల్గొన్నారంటూ ఆ మహాపర్వాన్ని హ్యూయాన్ సాంగ్ (644) ఈ కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. ప్రయాగను ‘మహత్తర దాన క్షేత్రం’గా అభివర్ణించాడు.
తొమ్మిదో శతాబ్దంలో శంకరభగవత్పాదుల ప్రచారం కారణంగా, కుంభమేళాకు మరింత ప్రాచుర్యం లభించింది. వారి చొరవతోనే కుంభమేళా ప్రస్తుత రూపం సంతరించుకుందని చెబుతారు. ఆదిశంకరులు నాలుగు పీఠాలను, పది సాధు సంప్రదాయాలను స్థాపించారు. ఈ సాధువులంతా కుంభపర్వంలో సమావేశమై సమాలోచనలు జరపాలని, ప్రజలలో సమైక్యాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించాలని ఆదేశించారు. ఆ పరంపరలోనే హిమాలయ గుహలలో తపస్సు చేసుకునే మహాత్ములు, యోగులు, వివిధ సంప్రదాయాల గురువులు, ఆచార్యులు, తమ అనుయాయులకు, సమాజానికి ఆధ్మాత్మిక సందేశాలు ఇవ్వడం అనుశ్రుతంగా వస్తోంది. అన్ని పంథాల, పీఠాల అధిపతులు సమావేశమై గతం గురించి సమీక్షించి, భవిష్యత్ గురించి చర్చించి, తరువాతి కుంభమేళాకు ప్రణాళికను రూపొందిస్తారు.
హరికథలు, ధార్మికోపన్యాసాలు ఉంటాయి. పండిత సభలలో శాస్త్రార్థాలపై చర్చలు జరిగి క్లిష్ట విషయాలకు పరిష్కారం కనిపిస్తుంది. ప్రతి కుంభమేళాలో బృహత్తరమైన విద్వత్ గోష్ఠులు జరుగుతాయి. వివిధ సంప్రదాయాల గురువులు, ఆచార్యులు తమ అనుయాయులకు, సమాజానికి సందేశాలను ఇస్తుంటారు.
కుంభమేళా ఆవిర్భావం
ప్రపంచంలోని ధార్మిక సమ్మేళనాలలో అగ్రగణ్యం కుంభమేళ. దేశంపై ఎన్ని ఆఘాతాలు వచ్చినా పరంపరగా కొనసాగుతూ వస్తున్న అతి ప్రాచీనం, అతి చైతన్యవంతమైన పర్వదినం. కుంభమేళా భారతీయ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అతి పెద్దది. కుంభమేళా భారతీయులకూ, విదేశీయులకే కాదు… దేవతలకూ పరమపావనమైనది. ఆ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముక్తి, మోక్ష మార్గమని చాలా మంది భక్తులు విశ్వసిస్తారు. కుంభ మేళాలో… ముఖ్యంగా త్రివేణీ సంగమంలో మునక వేసి, పునీతులు కావడానికి దేవతలు కూడా మానవ రూపంలో దిగివస్తారని పురాణ గాథ. కుంభమేళా పవిత్ర స్నానంతో మనస్సు, ఆత్మశుద్ధి అవుతాయని నమ్ముతారు.
వేదకాలం నాటి ఈ కుంభమేళా గురించి శ్రీమద్భాగవతం, మహాభారత, విష్ణు పురాణాలలో ఉంది. కుంభమేళ ఆవిర్భావానికి సంబంధించి గాథ ప్రకారం… అమృతం కోసం దేవదానవులు మంధర పర్వతం కవ్వం, అనంతనాగం తాడుగా పాలకడలిని మధించారు. ధన్వంతరి భగవానుడు అమృత కుంభంతో ప్రత్యక్షమయ్యాడు. అమృత సేవనంతో శాశ్వతత్వం పొందేందుకు దేవాసురులు పోటీపడ్డారు. సూర్య, చంద్ర, బృహస్పతి సాయంతో ఇంద్ర కుమారుడు జయంతుడు ఆ కుంభాన్ని అందుకొని అక్కడి నుంచి నిష్క్రమించాడు. దానవులు వెంటాడారు. ఆ పారువేటలో జయంతుడు ప్రయాగ, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలలో సేదదీరాడు. ఇదంతా మొత్తం 12 దినాలు (ఆ సమయాన్ని మానవ ప్రమాణంలో పన్నెండేళ్లుగా పరిగణిస్తారు) జరిగింది. అమృత కుంభ స్పర్శతో ఆయాస్థలాలు విశేష పవిత్రతను పొందాయి.మరో పాఠాంతరం ప్రకారం, దేవతాలు అమృతభాండాన్ని తీసుకువెళుతుండగా,అందులోని అమృతబిందువులు నాలుగు చోట్ల.. (ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని) పడి, ఆ ప్రదేశాలు కుంభమేళా నిర్వహించే పవిత్ర స్థలాలుగా మారాయి. ఆ సంఘటనను స్మరించుకుంటూ నిర్వహించేదే కుంభమేళా పర్వం. ఆ కాలంలో నదులు అమృత తుల్యమవుతాయని, ఆ సమయంలో ఆయా ప్రాంతాల నదుల్లో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుందని, పునర్జన్మ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. ‘ఒక పనిని సామూహికంగా చేపట్టడంలో అనిర్వచనీయం, అగణితమైన శక్తి ఆవిర్భవిస్తుంది. సామూహికంగా మంత్ర పఠనం చేసినప్పుడు వాటి ప్రభావం సహస్రాధికమవుతుంది. కుంభమేళా ఆ కోవకు చెందినదే’అని విజ్ఞులు, ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.
కుంభమేళా ఐదు రకాలుగా(మహాకుంభమేళా, పూర్ణకుంభమేళా, అర్ధకుంభమేళ, కుంభమేళా, మాఘ్ కుంభ్ మేళా) నిర్దేశిత ప్రదేశాలలో జరుగుతుంది. 1. మహా కుంభమేళా ప్రయాగలో (అలహాబాద్)లో మాత్రమే జరుగుతుంది. ఇది ప్రతి 144 సంవత్స రాలకు లేదా 12 పూర్ణ కుంభమేళాల తర్వాత వస్తుంది. ఈసారి మహాకుంభమేళా సమయాన్ని అధికారికంగా కచ్చితంగా ప్రకటించ•లేదు. త్వరలో ఉండవచ్చని అంచనా. 2. పూర్ణ కుంభమేళా పన్నెండేళ్లకు ఒకసారి అలహాబాద్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో జరుగుతుంది. 3.అర్ధ కుంభమేళాను ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్, అలహాబాద్‌లో నిర్వహిస్తారు.4. కుంభమేళా ఉజ్జయిని, అలహాబాద్, నాసిక్, హరిద్వార్‌లో జరుగు తుంది. 5. మాఘ్ (కుంభ్) మేళా (మినీకుంభ్)ను సంవత్సరానికి ఒకసారి జనవరి-ఫిబ్రవరిలో 45 రోజుల పాటు అలహాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు.
కుంభమేళా గ్రహాల స్థానంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆయా రాశులలోకి బృహస్పతి, సూర్యచంద్రుల సంచారాన్ని బట్టే కుంభమేళాలు నిర్ధారితమవుతాయి. మాఘమాసంలో బృహస్పతి కుంభరాశిలోకి, సూర్యుడు మేషరాశిలోకి, లేదా సూర్యచంద్రులు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు కుంభమేళా నిర్వహిస్తారు. దేవగురువు బృహస్పతి వృషభరాశిలో, గ్రహాల రాజు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి,సూర్యుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు నాసిక్‌లో గోదావరి వద్ద, బృహస్పతి సింహరాశిలోకి, సూర్యుడు మేష రాశిలోకి లేదా సూర్యచంద్రులు తులారాశిలో ప్రవేశించి నప్పుడు ఉజ్జయినిలో క్షిప్రానది వద్ద కుంభమేళా జరుగుతుంది. సూర్యుడు మేష రాశిలో, బృహస్పతి కుంభ రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో గంగవద్ద కుంభమేళా నిర్వహిస్తారు.
కుంభపర్వం సమయంలో పవిత్ర జలంలో నక్షత్రాల సంగమం ఉంటుందని, ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఆరోగ్యం సహా పుణ్య ప్రయోజనాలు దక్కుతాయని, మకర సంక్రాంతి వేళ చేసే దానధర్మాలతో శుభ ఫలితాలు సిద్ధిస్తాయని చాలా మంది నమ్ముతారు. దానధర్మాలకు పరిమితి అంటూ లేకపోయినా, శక్తిమేరకు చేస్తారు. కశ్మీర్ మహారాజు 99,999 గుర్రాలను, శ్రీహర్షుడు భూములను, పశువులను, రత్నాలు, బంగారం, వెండి దానం చేశాడని గాథలు ఉన్నాయి. నువ్వుల నూనెతో స్నానం చేయడం, నువ్వులతో హోమం చేయడం, నువ్వులు కలిపిన నీరు తాగడం, నువ్వులతో తయారు చేసిన పదార్థాలను తినడం, నువ్వులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు సిద్ధిస్తాయని పురాణవాక్కు.
తీర్థరాజం ప్రయాగ
ప్రయాగ ‘త్రివేణి సంగమ’ పవిత్రభూమిగా వినుతికెక్కింది గంగ, యమున,సరస్వతులు సంగమించే ప్రదేశం ప్రయాగ రాజ్. మొదటి రెండు నదులు మనకు భౌతికంగా దర్శనమిస్తే, మూడవది సరస్వతి అంతర్వాహిని. భరతభూమిపై ఒకనాడు గలగలమని ప్రవహించిన ఈ జీవనది కాలక్రమంలో క్షీణించి అంతర్వాహినిగా మారింది. సరస్వతీ తీరంలో కురుక్షేత్రం ఉండగా, దాని సమీపంలోని వినాశన అనే చోట అది అంతర్థానమైందంటారు. మూడు నదులు సంగమించడానికి ముందు గంగానది లోతు కేవల నాలుగు అడుగులే కాగా, యమున లోతు 40 అడుగులు కావడం విశేషం. ‘తీర్థరాజం’గా పేరుపొందిన ప్రయాగలో బ్రహ్మదేవుడు తన ప్రాకృష్ట యాగాన్ని నిర్వహించాడని మహాభారతం పేర్కొంటోంది. ‘ప్ర’ అంటే గొప్పది అని అర్థం. అందువల్ల దీనికి ‘ప్రయాగ’ లేదా ప్రయాగరాజ్ అనే పేరు వచ్చిందంటారు. ప్రళయ కాలంలో భూమి అంతా సముద్ర జలంతో మునిగిపోయినా ఈ క్షేత్రానికి ఎలాంటి ముప్పు ఉండదట. శ్రీ మహావిష్ణువు వటపత్రశాయి రూపంలో ఇక్కడ ప్రత్యక్షమై ఉంటాడని, సర్వ దేవతలు ఈ తీర్థాన్ని కాపాడుతూ ఉంటార•ని చెబుతారు. ప్రయాగ కుంభమేళ ప్రపంచ ధార్మికసమ్మేళనానికి తలమానికం పేరొందింది. ఇలా పవిత్ర నదుల సంగమ క్షేత్రంగా భారతీయ సంస్కృతిలో మహోన్నత మైన త్యాగభావనకు స్ఫూర్తి కేంద్రంగా నిలిచింది.
శతాబ్దాల చరిత గల కుంభమేళాలలో గత ఆరు దశాబ్దాల కాలంలో జరిగిన వాటిలో మేటి 1966 నాటి ప్రయాగ్ రాజ్ కుంభమేళ అని, అప్పటి దాకా ఎన్నడూ ఎరుగనంతటి కార్యక్రమని చరిత్ర చెబుతోంది. విశ్వహిందూ పరిషత్ విరాట్ రూపం దాల్చింది. ఆ మహా సంరంభంలో విశ్వహిందూ పరిషత్ మహాసభ, గోహత్య నిషేధ ఉద్ఘాటన మైలురాళ్లుగా నిలిచాయి. విశ్వహిందూ పరిషత్ విశ్వహిందూ సమ్మేళనం నిర్వహించగా, గోహత్యను నిషేధించాలని పట్టుబడుతూ సాధువులు ఉపవాస దీక్షబూనారు. ‘స్వరాజ్యానంతరం 19 సంవత్సరాలకూ గోహత్యను నిషేధించకపోవడం విచారకరం. హిందువులు అనైక్యంగాను, అకర్ముణ్యులుగానూ ఉన్నారు. అందువల్ల వారి మనోభావాలను ఏ మాత్రం లక్ష్యపెట్టడం లేదు’ అని అఖిల భారత గోరక్షా సమ్మేళనంలో పూజ్య గురూజీ ప్రభుత్వ తీరును నిశితంగా విమర్శించారు. ‘విశ్వమందలి హిందూ ప్రతి నిధులు,హైందవ గురుజనులు ఈ సమష్టి సమ్మేళనపు ఆజ్ఞానుమతు లతో విశ్వహిందూ పరిషత్ ఒక శాశ్వత సంస్థగా వెలుగొందింది. ప్రయాగ కీర్తి సార్థకమైంది. దాని క్షేత్రమహాత్మ్యం ఇనుమడించింది’ అని ‘జాగృతి’ సంపాదకీయం (జనవరి 31,1966) పేర్కొంది. ‘హిందూ సమాజమునందలి సమస్త పథీ•యులు, సమస్త సంప్రదాయ ఆచార్యవర్యులు, గురుజనులు ఒక్కచోట సమావేశమై, తమ జ్ఞాన సర్వస్వమును మధించి హిందూ సమాజమందలి ఏకత్వా మృతమును చవి చూపించిన సందర్భం ఇంతకు పూర్వం లేదు. కనుకనే సమ్మేళనంలో ప్రసంగించిన స్వాములొకరు ‘ఇంతవరకు సాగుతున్నది స్నానకుంభం… ఇది జ్ఞానకుంభం’ అని చమత్కరించడాన్ని సంపాదకీయం గుర్తు చేసింది.
‘ప్రపంచంలో మరే దేశంలోనూ ఒక ధార్మిక నిమిత్తంతో ఇంత భారీ సంఖ్యలో ఏకత్రితమైన సందర్భంలేదు’ అని కుంభమేళాను సందర్శించిన ఒక విదేశీ ప్రతినిధి బృందం వ్యాఖ్యానించిందని ‘జాగృతి’ (ఫిబ్రవరి 24,1966) పేర్కొంది. అప్పటి దేశ జనాభా దామాషా ప్రకారం 60 లక్షల మందికి ఏర్పాట్లు జరగగా, 70 లక్షల మంది వచ్చినట్లు నాటి మేళ కమిషనర్ జెడీ శుక్లా ప్రకటించారు.





