ArticlesNews

ఉగ్ర రక్కసి అంతానికిదే తగిన తరుణం

576views

భారతదేశంలోని వివిధ ప్రాంతాల లో దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ లు ప్రకటించిన నేపథ్యంలో…..

ఉగ్రవాదాన్ని, దాని నాయకులని అణచడానికి ఇదే సరైన సమయం. భారత్, పాకిస్థాన్ నేతలు ఇద్దరూ అగ్రరాజ్యంలో పర్యటిస్తున్న ఈ సందర్భంలో, ఉగ్రవాదులు భారతదేశంపైన దాడులు చేస్తామని ప్రకటించడం, వాళ్ల తెంపరితనానికి, విద్వేషానికి పరాకాష్ఠ.

ఇక సహించవలసిన అవసరం లేదు.  నిజంగానే పాకిస్థాన్ ప్రధానమంత్రికి ఉగ్రవాదులను అణచివేసే ఉద్దేశమే ఉంటే, ఆయన తన సహకారాన్ని నిజాయితీగా అంతర్జాతీయ వేదికపై ప్రకటించడం మంచిది. కనీసం ఆయనపై సానుభూతి అయినా మిగులుతుంది.

రెండు దేశాల ప్రధానులు  తమ ఉగ్రవాదం అంతానికి అనుమతిని, ఆలోచనలను తెలియజేసి, తక్షణమే ఇరు దేశాల సైనిక బలగాలు సమైక్యంగా పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను, వారి నాయకులను నేలమట్టం చేయడం మంచిది. ఎలాగూ భారత్ అందుకు సిద్ధమే. అగ్రరాజ్య వేదికపై ఉగ్రవాదం యొక్క తీవ్రతని మన ప్రధాని ఇప్పటికే ఎంతో సమర్థవంతంగా వివరించారు. ఇక మిగిలింది కార్యాచరణ మాత్రమే. అందుకు కావలసింది పాకిస్థాన్ చిత్తశుద్ధి, సన్నద్దత.

నిజానికి ఉగ్రవాదం ఒక్క భారత దేశానికే పరిమితం కాలేదు. మత ఉగ్రవాదం భూమండలమంతా భూతమై వ్యాపించి ఉంది. అదను చిక్కినప్పుడల్లా తన రక్కసి పంజా విసురుతూనే ఉంది. అమెరికాలో జరిగిన సెప్టెంబర్11 దాడులతో సహా లండన్లో భూగర్భ రైల్వే స్టేషన్లో జరిగిన దాడి, ఇటలీలో పత్రికా కార్యాలయంపై జరిగిన దాడి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ భూ మండలంలో ఉగ్రవాద రక్కసి కన్ను పడని చోటుండదేమో? కనుక ఉగ్రవాదం ఏదో భారత్ కు మాత్రమే పరిమితమనుకుంటే ప్రపంచ దేశాలన్నీ తప్పులో కాలేసినట్టే.

మత ఉగ్రవాదం నేడు ప్రపంచ సమస్య. అందరూ దృష్టి పెట్టాల్సిన సమస్య. ఆ ఉగ్రవాదానికి మూలాలెక్కడున్నా పెకలించి వేయవలసిందే. దాని ఊడలు ఎక్కడిదాకా విస్తరించి ఉన్నా వాటిని తొలగించవలసిందే. అందుకు యావత్ప్రపంచం నడుం బిగించాలి. కలసికట్టుగా వ్యూహాలు రచించి, అమలు చెయ్యాలి. ఉగ్రవాద రక్కసిని అంతమొందించాలి.

ఈ దసరా మహోత్సవం సందర్భంగా ఆ  “మహిషాసుర మర్థని దేవి” ని ఇంతకంటే కోరవలసినదేమున్నది?  ప్రపంచ శాంతి కోరేవారు అందరూ కలసి రండి,  ప్రార్థిద్దాం. “దుష్ట శిక్షణ” ఈ దసరా మహోత్సవం సందర్భంగా ప్రారంభం కావాలి. ఉగ్రవాద భూతం అంతంతో యావత్ప్రపంచంలో దీపావళి వెలుగులు నిండాలి.

రచన : పులిగడ్డ రాధాదేవి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.