
“ నేటి మహిళలు ఎవరిపై ఆధారపడకుండా తమ బాగోగులు తాము చూసుకునే సామర్థ్యం కలిగి ఉన్నారు. మహిళా అభివృద్ధి గురించి తమకు ఎక్కువ తెలుసని పురుషులు అనుకోవాల్సిన అవసరం లేదు” అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత్లో “మహిళల స్థితి గతులు” నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళాభ్యుదయం ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలన్నారు. “దృష్టి” అనే సంస్థ చేసిన అధ్యయనం చాలా ముఖ్యమైనదని డాక్టర్ భాగవత్ అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
‘ దృష్టి స్త్రీ అధ్యయన ప్రబోధం కేంద్ర’ గత రెండు దశాబ్దాలుగా సమాజంలో మహిళల స్థితిగతుల గురించి అధ్యయనం చేస్తోంది.


‘మహిళల స్థితిగతులు‘ దృష్టి’ నివేదిక: ముఖ్యాంశాలు
-2017-18 సంవత్సరాల కాలంలో 5 ప్రాంతాలు, 29 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాలు, 465 జిల్లాల వ్యాప్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. భారతదేశంలో 17 రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్నాయి. భారతదేశంలో, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఉన్న మొత్తం జిల్లాలు 106. వీటిలో 70 జిల్లాలలో (66.04%) అధ్యయనం జరిగింది. 18 సంవత్సరాలు వయసు పైబడిన మహిళల నుంచి వివరాలు సేకరించే నిబంధనతో మొత్తం 43,255 మంది మహిళల నుంచి వివరాలు సేకరించారు.
-18 సంవత్సరాల లోపు వయసున్న బాలికలపై కూడా ఇదే తరహాలో ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. 5 ప్రాంతాలు, 25 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 283 జిల్లాల నుంచి 7675 మంది బాలికల నుంచి వివరాలు సేకరించారు.
-చదువు మధ్యలోనే చాలా మంది బాలికలకు పెళ్లి చేస్తున్నారు. అవివాహితులైన స్త్రీలు (21.96%) వీరిలో అత్యధికులు 18-25 మధ్య వయసున్నవారు.
– హిందూ, ముస్లిం, బుద్ధ క్రిస్టియన్, జైన్ మరియు సిక్కు వంటి అన్ని ప్రధాన మతాల మహిళల నుంచి వివరాలు సేకరించబడ్డాయి.
విద్య
2011జనాభా లెక్కల ప్రకారం, స్త్రీల అక్షరాస్యత శాతం 64.63 గా ఉంది. ప్రస్తుత అధ్యయనంలో స్త్రీ అక్షరాస్యత శాతం 79.63 శాతంగా కనుగొనబడింది. అక్షరాస్యతా శాతం పెరిగడం తోపాటు వారిలో కొద్దిమంది గ్రాడ్యుయేషన్ పైన విద్యా స్థాయిని సాధించగలగడం విశేషం.
– షెడ్యూల్డ్ తెగ మహిళలు, షెడ్యూల్డ్ కులాల మరియు వెనుకబడిన తరగతుల మహిళలలో నిరక్ష్యరాస్యత అధికంగా ఉన్నట్లుగా ఈ అధ్యయనంలో తేలగా ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నమహిళల్లో నిరక్షరాస్యత శాతం తక్కువగా ఉంది.
-వివాహం మరియు ఆర్థిక ఇబ్బందులు అనేవి మహిళల్లో విద్యను నిలిపివేయడానికి ప్రధాన కారణాలుగా అధ్యయనంలో తెలుస్తోంది.
-షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగలు, ప్రత్యేక వెనుకబడిన తరగతులు, ఇతర వెనుకబడిన వర్గాల మహిళలకు ఉన్నత స్థాయి విద్యను సాధించడానికి రిజర్వేషన్ విధానం, విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వం తీసుకునే మద్దతు చర్యలు తోడ్పదుతూండడం గమనించవచ్చు.
-అధ్యయనంలో భాగస్వాములైన మహిళల్లో మూడింట రెండు వంతుల మంది తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని తెలియజేయలేకపోయారు. ఇంటి కార్యకలాపాల ఒత్తిడి మరియు సాంప్రదాయ ఆలోచనా విధానంతోపాటు వివిధ పాత్రలను నిర్వహించాల్సి ఉండడం ఆసక్తుల గురించిన ఆమె ఆలోచనలను నిరోధిస్తున్నాయి లేదా పరిమితం చేస్తున్నాయి. చాలా మంది తమకు దేనిపై ఆసక్తి ఉన్నదన్న విషయం గురించి కూడా ఆలోచించడం లేదని పేర్కొన్నారు.
– నాలుగోవంతుకు పైగా మహిళలకు తగినంత విరామ సమయం కూడా లభించటం లేదని ఈ అధ్యయనంలో తేలింది.
ఉపాధి
-మహిళా ఉపాధి రేటు ఎస్టీ కేటగిరీలో అత్యధికం మరియు మహిళా నిరుద్యోగ రేటు ఓపెన్ కేటగిరీలో అత్యధికం.
-ఉపాధి పొందుతున్న మహిళల్లో అత్యధికులు తమ పని ప్రదేశంలో కాంటీన్, రవాణా మరియు విశ్రాంతి గది సౌకర్యాల తోపాటు కూర్చునే సదుపాయం కూడా లేదని పేర్కొన్నారు. వీరిలో 60 శాతం కంటే ఎక్కువ మందికి ఋణ సదుపాయం లేదు.
– అధ్యయనంలో క్రైస్తవ మతం నుంచి వచ్చిన మహిళల్లో అత్యధిక శాతం ఉపాధిని గమనించారు. హిందూ, బౌద్ధ, ముస్లిం, జైన, సిక్కు మహిళలు ఆ తర్వాతి స్థానాలలో వరుసగా ఉన్నారు .
ఆరోగ్యం & పోషణ
– దాదాపు సగం మంది మహిళలు రోజులో రెండు సార్లు భోజనం చేస్తారు, కానీ ఇప్పటికీ 3.73 శాతం మంది మహిళలు రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం తీసుకుంటారు. అదే ఆధ్యాత్మిక రంగంలోని మహిళలను పరిశీలిస్తే ఇలా ఒక్క పూట భోజనం చేసే మహిళలు దాదాపు పది శాతం వరకు ఉన్నారు.
-18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల్లో, రుతుచక్ర సమస్య అనేది ప్రధాన సమస్య. షుమారు 64 శాతం మంది దీని బారిన పడుతున్నారు. ఇక కీళ్ళ సమస్యలు రెండో స్థానంలో ఉంది. పదిహేను శాతం మందికి పైగా కీళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. ఆశ్చర్యకరంగా వారిలో కొందరు రక్తపోటుతో (5.28%), గుండె సమస్య (3.07%), మధుమేహం (1.62%) మరియు క్యాన్సర్ (0.51%) లతో బాధపడుతున్నారు.
– అధ్యయనంలో దాదాపు 40 శాతం మంది మహిళలు గత రెండేళ్లలో ఆస్పత్రిలో చేరడం జరిగినట్లుగా తెలుస్తుండగా ఆ శాతం ఆధ్యాత్మిక రంగంలోని మహిళల విషయంలో చాలా ఎక్కువగా ఉంది. 18 నుంచి 20 సంవత్సరాల వయస్సు ఉన్నమహిళల్లో ఆసుపత్రిలో చేరే వారు ఎక్కువగా ఉంటున్నారు.
– ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారిలో గిరిజన మహిళలే అత్యధికంగా ఉండడం గమనార్హం.
-దాదాపు 80 శాతం మంది మహిళలు సుఖమైన, శ్రేయోదాయకమైన జీవితాన్ని గడుపుతున్నామని తెలుపగా, ఆధ్యాత్మిక క్షేత్ర౦ ను౦డి వచ్చిన మహిళల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది.
– వివాహిత మహిళలు అధిక స్థాయిలో సంతోషాన్ని కలిగి ఉన్నామని తెలుపగా, సహజీవనం చేస్తున్న మహిళల్లో ఆనందం తక్కువగా కనిపిస్తోంది.
– 90 శాతం మంది, కుటుంబం లేని మరియు ఆదాయం లేని మహిళలు, చాలా అధిక స్థాయి సంతోషాన్ని కలిగి, ఆనందంగా ఉన్నట్లుగా చెప్పారు. కుటుంబ ఆదాయం రూ .10, 000/-కంటే తక్కువగా ఉన్న మహిళల్లో కూడా ఆనందం కనిపిస్తుంది. ఆనందం మరియు స్వస్థత కుటుంబ ఆదాయంపై ఆధారపడి లేదని దీన్ని బట్టి అవగతమౌతోంది.
సిఫార్సులు
- ఓటు కార్డు గురించి అవగాహన మహిళలలో ఉండాలి.
- నార్త్ ఈస్ట్ లో మహిళలకు ఆధార్ కార్డు పొందడానికి ప్రేరణ కల్పించాలి.
- ఉత్తర ప్రాంతంలోని స్త్రీలకు వ్యక్తిగత బ్యాంకు ఖాతా కలిగి ఉండటం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పట్టణ మురికివాడల్లోని గిరిజన మహిళలు, మహిళలకు కూడా ఇవే వ్యూహాలు అమలు చేయాలి; తద్వారా వారు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు.
- అక్షరాస్యత స్థాయిని పెంచేందుకు గిరిజన మహిళలకు ప్రత్యేక సహాయ కార్యక్రమం, వ్యూహాలు అవసరం.
- వారి సిలబస్ ను వారి దైనందిన జీవితానికి పనికి వచ్చేలా తయారు చేయాల్సి ఉంటుంది.
- పాఠ్య ప్రణాళికలో విషయ పరిజ్ఞానం, జీవన నైపుణ్యం, శారీరక దారుఢ్యం, నైతిక విలువల ప్రాధాన్యత, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం ఉండాలి. దీన్ని విద్యారంగంలోని అన్ని స్థాయిల్లో పొందుపరచాలి.
- ప్రభుత్వ (కేంద్ర/రాష్ట్ర) మరియు స్వచ్చంధ సంస్థలు సాధారణంగా ఉన్నత పాఠశాల స్థాయిలో మహిళా డ్రాపౌట్ రేటును తగ్గించడానికి ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగల బాలికలు (ప్రాథమిక స్థాయిలో), మరియు షెడ్యూల్డ్ కులాల బాలికల (మధ్య పాఠశాల స్థాయిలో) విషయంలో ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలి.
- సమాజంలో, కుటుంబ స్థాయిలో కూడా లింగ సమానత్వం కోసం ఎన్ జీ ఓ లు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది.
- మహిళలకు కంప్యూటర్లలో ప్రవేశం తక్కువ ఉండడంతో పీఎంకేవై వంటి పథకాల గురించి తెలియదు. అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్ లైన్ లో ఉన్నందున ఈ స్కీమ్ వల్ల తగినంత ప్రయోజనం పొందలేకపోతున్నారు. మహిళలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి పథకాలపై అవగాహన తరగతులు నిర్వహిస్తే మంచిది.
- వివిధ అంశాలలో మరిన్ని నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు మహిళల కోసం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో ఉద్యోగాల్లో మహిళలు పాల్గొనే ప్రక్రియను వేగవంతం చేసేందుకు తోడ్పాటు ఉంటుంది.
- నైపుణ్య శిక్షణ ఉపాధిని కల్పించేదిగా ఉండాలి. నైపుణ్య శిక్షణ కార్యక్రమ కేంద్రాలను ప్లేస్ మెంట్ ఏజెన్సీలకు జత చేయాలి.
- క్షేత్ర స్థాయిలో ఉపాధి కల్పనకు సంబంధించిన అన్ని పథకాలను అర్హులైన వారందరికీ చేరేలా విస్తరించాల్సిన అవసరం ఉంది. వాటి పట్ల అవగాహన మహిళలకు అవగాహన కలిగేలా పట్ల కృషి చేయాలి.
- మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాల రూపకల్పన చేయాలి.
- కుల, వైవాహిక హోదాతో సంబంధం లేకుండా సేవా రంగంలోని అన్ని రకాల మహిళలకు నియామక స్థాయిలోని వయో ప్రమాణాల్లో సడలింపు అమలు చేయాలి. ఎక్కువ మంది మహిళలు నిరుద్యోగులుగా ఉండడానికి ప్రధాన కారణం వివాహం కారణంగా కుటుంబం మారడం మరియు వివాహ ప్రారంభ దశలో బాధ్యతలను నిర్వహించవలసి రావడం.
- అసంఘటిత రంగంలోని మహిళల స్థితిని చూసుకోవడానికి పర్యవేక్షణ సంస్థ ఉండాలి. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు, నైపుణ్యం లేని కార్మికులు అనేక విధాలుగా దోపిడీకి ఎక్కువగా గురవడం మనం గమనించవచ్చు.
- ప్రతి స్థాయిలోనూ అంతర్గత ఫిర్యాదు కమిటీలు, వ్యవస్థ సమర్థవంతంగా అమలు చేయడం అవసరం.
- పాఠశాల స్థాయిలోనే ఉపాధిని కల్పించే నైపుణ్య శిక్షణను అందించాలి. నిరక్షరాస్యులు, అండర్ గ్రాడ్యుయేట్లకు ఇలాంటి శిక్షణలు ఇవ్వడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
- పౌష్టిక ఆహారం యొక్క ప్రాముఖ్యతను, కడుపు నిండుగా ఆహారం తీసుకోవలసిన ఆవశ్యకతను అన్ని వర్గాల మహిళలకు వివరించవలసి ఉన్నది.
- కౌమార బాలికలకు అవగాహన కార్యక్రమాల తోపాటు వారి పరిస్థితులపై ప్రభుత్వ జోక్యం కూడా అవసరం. ఎందుకంటె 60 శాతం కంటే ఎక్కువ మంది కౌమార బాలికలు ఋతుస్రావ సమస్యలతో బాధపడుతున్నారు.
- కీల సమస్యలు, రక్తపోటుపై ప్రత్యేక నివారణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.గిరిజన మహిళల ఆరోగ్య స్థితిని నిర్ధారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.





